కంప్యూటర్స్ క్రాష్: విమానాలు రద్దు
కంప్యూటర్స్ క్రాష్: విమానాలు రద్దు
Published Sat, May 27 2017 8:12 PM | Last Updated on Tue, Sep 5 2017 12:09 PM
లండన్ : కంప్యూటర్లు క్రాష్ అవడంతో బ్రిటీష్ ఎయిర్ వేస్ తన విమానాలన్నింటిన్నీ రద్దు చేసింది. మేజర్ ఐటీ సిస్టమ్ ఫెయిల్యూర్ తో ప్రపంచవ్యాప్తంగా నడిపే తమ విమాన కార్యకలాపాల్లో తీవ్ర అంతరాయం చోటుచేసుకుందని ఈ విమానయానసంస్థ ప్రకటించింది. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించినందుకు క్షమాపణ చెప్పింది. ఈ అంతరాయంతో లండన్ లోని రెండు ప్రధాన విమానశ్రయాల నుంచి నడిపే విమానాలను రద్దుచేస్తున్నట్టు పేర్కొంది. లోకల్ టైమ్ సాయంత్రం ఆరుగంటల వరకు హీత్రూ, గాట్విక్ విమానశ్రయాల నుంచి తమ ఎయిర్ వేస్ కు చెందిన ఎలాంటి విమానాలు ఉండవని తెలిపింది. ఇటీవల నెలల్లో చాలా సార్లు బ్రిటీష్ ఎయిర్ వేస్ తన కంప్యూటర్ సిస్టమ్ ఫెయిల్యూర్స్ తో తీవ్ర సతమతమవుతోంది. ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని బ్రిటీష్ ఎయిర్ వేస్ పేర్కొంది.
అయితే ఐటీసిస్టమ్స్ క్రాష్ అవడంతో సైబర్ అటాక్ ఏమైనా జరిగిందేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఐటీ సిస్టమ్స్ పై సైబర్ అటాక్ జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని తెలుస్తోంది. వీకెండ్ కావడంతో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. చాలామంది ప్రయాణికులు దీనికి ప్రభావితమైనట్టు తెలిసింది. ప్రయాణికులకు రీషెడ్యూలింగ్ లేదా రీఫండ్ అనే రెండు ఆప్షన్లను బ్రిటీష్ ఎయిర్ వేస్ ప్రకటించింది. అయితే హీత్రూ, గాట్విక్ లనుంచి ప్రయాణించే ఇతర విమానాలకు ఎలాంటి ప్రభావం చూపడం లేదు. ఆరుగంటల తర్వాత ప్రయాణించే ప్యాసెంజర్లు కూడా తమ విమాన ప్రయాణ సమయాలను ఓ సారి చెక్ చేసుకోవాలని బ్రిటీష్ ఎయిర్ వేస్ సూచించింది.
Advertisement