తనూ గార్గ్ మెహతా
‘ఒక చిన్న అడ్డంకి కూడా నా ఎదుగుదలను ఆపలేదు’ అంటోంది మోడల్ తనూ గార్గ్ మెహతా. భారతదేశంలోని హర్యానాలో పుట్టి పెరిగిన తనూ కెనడా వెళ్లి, అటు నుంచి అమెరికా చేరుకొని ప్రసిద్ధ కంపెనీలలో పని చేస్తూ అక్కడి గ్లామర్ ప్రపంచంలో మహామహులతో పోటీ పడుతూ గుర్తింపును పొందుతోంది.
బ్రిటిష్ ఎయిర్‌లైన్, వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్‌వేస్‌లో ఫ్లైట్ అటెండెంట్‌గా పనిచేసిన అనుభవం తనూ గార్గ్ సొంతం. రాబోయే మిసెస్ వరల్డ్ పోటీలకు సిద్ధం కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. వర్ణ వివక్షను ఎదుర్కొంటూ ఒంటరి పోరుకు సిద్ధపడింది.
అమెరికాలో పర్యావరణం కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థ కోసం పనిచేస్తోంది. ప్రకటనలలో నటిస్తోంది. కలల సాధనకు కృషితోపాటు కుటుంబం బంధాన్ని నిలుపుకోవాల్సిన విధానం గురించి కూడా వివరిస్తోంది.
‘‘భారతీయ మహిళ అనే కారణం ఏ దశలోనూ నన్ను తగ్గించలేదు. మోడల్‌గా రాణించాలనే నా కల నా పని షెడ్యూల్‌నూ మార్చలేదు. రంగుల ప్రపంచంలో విజయం సాధించడానికి ఏం అవసరమో నాకు తెలుసు. హర్యానాలోని కర్నాల్ జిల్లాలో పుట్టి పెరిగాను.
మధ్య తరగతి కుటుంబం. బి.టెక్ అయ్యాక పై చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకున్నాను. కానీ కుటుంబం ఆర్థికంగా మద్దతు ఇవ్వడానికి చాలా కష్టమైంది. కెనడా వెళితే కొంత ఖర్చు తగ్గుతుందనుకున్నా. అందుకు కుటుంబసభ్యులతో పాటు బంధువులు, స్నేహితుల సాయం తీసుకున్నాను. అప్పుడే అనుకున్నా ఎన్ని సవాళ్లు ఎదురైనా ఆర్థికంగా స్వతంత్రంగా నిలబడాలని.
అడుగడుగునా సవాళ్లు
కెనడాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాక పేరున్న ఐటి కంపెనీలలో ఉద్యోగం చేశాను. అక్కడే నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. మా ఇద్దరి బంధానికి గుర్తుగా కొడుకు పుట్టాడు. అందమైన కుటుంబం. హాయిగా సాగిపోతోంది జీవితం. కానీ, నా కల మాత్రం నన్ను వెంటాడుతూనే ఉంది. అమెరికాలోని అందాల పోటీలలో విజేతగా నిలవాలన్నది నా కల. అక్కడి రంగుల ప్రపంచంలో మోడల్‌గా రాణించాలన్నది లక్ష్యం. ఇందుకు నా భర్త మద్దతు లభించింది.
బాబును నా భర్త వద్ద వదిలి, కొద్ది కాలంలోనే అమెరికా చేరుకున్నాను. ఉద్యోగం చేస్తున్న సమయంలోనే చాలా విషయాలు స్పష్టమయ్యాయి. అమెరికాలో ఇతర దేశాల నుంచి వచ్చినవారికి ముఖ్యంగా స్త్రీకి చాలా సవాళ్లతో కూడిన జీవితం ఉంటుందని అర్థమైంది. మగవారితో పోల్చితే తక్కువ జీతం, వర్ణ వివక్ష, సాంస్కృతిక అడ్డంకులు .. ఎన్నో చూశాను. కానీ, అన్నింటినీ అధిగమించడమే నేను చేయాల్సింది అని బలంగా అనుకున్నాను.
అప్పుడే అందరికీ సమాన అవకాశాలకు మద్దతు ఇచ్చే సేవాసంస్థ నిర్వాహకులతో పరిచయమైంది. దీంతో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి సేవా సంస్థ పనుల్లో నిమగ్నమయ్యాను. మోడలింగ్ చేస్తూ, అందాల పోటీల్లో పాల్గొంటూనే సంస్థ పనులు చేస్తున్నాను. అలాగే, పర్యావరణ రక్షణకు పాటు పడే సంస్థకోసం కృషి చేస్తున్నాను. ఫలితంగా ఆర్థిక వెసులుబాటు, సేవాభాగ్యం లభించింది. నా లక్ష్యం నెరవేర్చుకోవడానికి మార్గమూ సులువయ్యింది.
దూరాన్ని దగ్గర చేసే నమ్మకం
పెళ్లి అనేది ఒక అద్భుతమైన విషయం. ఒక కప్పు కింద ఉన్నా, సుదూరంగా, ఇతర దేశాలలో ఉన్నా భాగస్వామి కలను అర్థం చేసుకోవడంతో బంధం బలంగా ఉంటుంది. దూరం హృదయాలను మరింత మృదువుగా మార్చేస్తుందనడానికి నా జీవితమే ఉదాహరణ. నిజానికి భారతీయ సంస్కృతిలో భార్య–భర్త దూరంగా ఉండటం ఇప్పటికీ నిషేధం. కానీ, బదిలీలు, దేశ రక్షణలో సైనికులు, అతిగా క్యాంపులు ఉండే ఉద్యోగాలు ఇవన్నీ జీవిత భాగస్వామికి దూరంగా ఉంచుతాయి.
దూరం అనేది వివాహానికి సవాల్‌గా ఉంటుంది. కానీ, సరిగ్గా నిర్వహిస్తే వారిద్దరి బంధం కచ్చితంగా బలంగా ఉంటుంది. ఒక మహిళ కుటుంబాన్ని పోషించగలదు, కలలను సాధించుకోవడానికి కృషి చేయగలదు. ఏదైనా సంబంధాన్ని కొనసాగించడంలో వారి మధ్య కమ్యూనికేషన్, నమ్మకం రెండూ కీలకమైన అంశాలు. ఇవి మా ఇద్దరి మధ్య ఉన్నాయి.
అందుకే నా కల కోసం నేను తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను. ఉద్యోగం చేస్తున్నాను. ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకోవడానికి ఫిట్‌నెస్, యోగా, ధ్యానం, పోషకాహారం .. అన్నింటిపైనా దృష్టిపెడుతున్నాను. తెలుపు–నలుపు, పొట్టి–పొడవు భేదాలేవీ మన కలలకు అడ్డంకి కావు. మానవ ప్రపంచంలో అందరూ సమానమే అని చాటాలన్నదే నా లక్ష్యం’’ అనే తనూ గార్గ్ ఎదుర్కొంటున్న సవాళ్లు మనకూ ఓ లక్ష్యాన్ని నిర్దేశిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment