మాజీ మోడల్, గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ ప్రియురాలు దివ్య పహుజా హత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. హత్య అనంతరం గురుగ్రామ్ హోట్‌ల నుంచి మృతదేహాన్ని తరలించిన బీఎండబ్ల్యూ కారును పోలీసులు తాజాగా పంజాబ్‌లోని పటియాలాలో గుర్తించారు. అయితే ఆ కారులో దివ్య మృతదేహం ఉందా, లేదా అనే విషయాన్ని పోలీసులు ఇంకా ధృవీకరించలేదు.
పటియాలాలోని బస్ స్టేషన్‌లో బీఎండబ్ల్యూ కారు పార్క్ చేసి ఉందని గురుగ్రామ్ పోలీస్, క్రైమ్ డిప్యూటీ కమిషనర్ విజయ ప్రతాప్ సింగ్ తెలిపారు. దివ్య మృతదేహాన్ని పంజాబ్‌కు తరలించినట్లు అనుమానిస్తున్న ఇద్దరు నిందితులు బాల్‌రాజ్, రవి బంగర్ పరారీలో ఉన్నారని, వీరికోసం గాలిస్తున్నామని ఆయన తెలిపారు. దివ్యతోపాటు ప్రధాన నిందితుడు అభిజీత్ సింగ్‌కు చెందిన సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అయితే, దివ్య వద్ద మరో ఫోన్ ఉందని ఆమె సోదరి చెప్పిందని, దాని కోసం కూడా పోలీసులు వెతుకుతున్నారని తెలిపారు.
కాగా పహుజా తన ప్రియుడు, గ్యాంగ్ స్టర్ సందీప్ గడోలీ హత్య కేసులో ఏడేళ్లు జైలుశిక్ష అనుభవించి గతేడాది జూన్‌లో బెయిల్‌పై విదుదల అయ్యారు. బుధవారం గురుగ్రామ్‌లోని ఓ హోటల్‌లో విగత జీవిగా కనిపించారు. హోటల్ యజమాని అభిజీత్ ఆమెను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా ఈ కేసుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అభిజీత్ సింగ్ సహా మొత్తం ఐదుగురు వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. దివ్య మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నిస్తుండగా వీరిలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సంబంధిత వార్త: మాజీ మోడల్ దారుణ హత్య
నిందితుడు అభిజీత్ మంగళవారం రాత్రి దివ్యను హోటల్ రూముకు తీసుకెళ్లి కాల్చి చంపినట్టు పోలీసులు తెలిపారు. తనకు సంబంధించిన కొన్ని అశ్లీల ఫొటోలు దివ్య ఫోన్‌లో ఉన్నాయని.. వాటిని డిలీట్ చేయాలని చెప్పినా ఆమె వినిపించుకోలేదని నిందితుడు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఆ ఫోటోలతో అనేక సార్లు బ్లాక్ మెయిల్‌కు పాల్పడి డబ్బులు డిమాండ్ చేయడం వల్లే ఆమెను హతమార్చినట్టు అభిజీత్ అంగీకరించినట్టు పోలీసులు పేర్కొన్నారు. దివ్య సోదరి నైనా పహుజా వాదన మరోలా ఉంది. సందీప్ గడోలీ సోదరి సుదేశ్ కటారియా, సోదరుడు బ్రహ్మ ప్రకాశ్‌లే కలిసి అభిజీత్‌తో హత్య చేయించారని ఆరోపించింది.
గడోలీ హత్య విషయానికి వస్తే.. 6 ఫిబ్రవరి 2016లో ముంబైలో పోలీసులు జరిపిన బూటకపు ఎన్‌కౌంటర్‌లో గడోలీ మరణించాడు. అతడి గర్ల్‌ఫ్రెండ్ అయిన దివ్య పహుజా.. సందీప్ వివరాలను పోలీసులకు చేరవేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఏడేళ్లపాటు జైలులో ఉన్న దివ్య ఇటీవలే బెయిలుపై బయటకు వచ్చింది. అంతలోనే ఆమె హత్యకు గురికావడం కలకలం రేపింది.
Comments
Please login to add a commentAdd a comment