కళ్లజోళ్లు, బూట్లతో కుక్కలు..!
లండన్: బ్రిటీష్ ఆర్మీకి చెందిన కుక్కలకు ఇక రక్షణ కవచాలు రానున్నాయి. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, కళ్లజోళ్లు, బూట్లు, చెవి ప్రొటెక్టర్లను ధరించనున్నాయి. ప్రమాదకర వాతావరణంలో పనిచేసే సంరక్షణ కల్పించేందుకు మిలటరీ వర్కింగ్ డాగ్ స్వ్కాడ్రన్(ఎమ్డబ్ల్యూడీఎస్) 105 కుక్కలకు ఈ పరికరాలను అమర్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జోర్డాన్లో జరుగుతున్న ఈ దశాబ్దంలోనే అతిపెద్ద మిలటరీ వ్యాయామాల్లో జాగీలాలకు బాడీ ఆర్మర్లను అమర్చి శిక్షణనిస్తున్నారు.
పెద్ద పేలుళ్లు సంభవించినపుడు శబ్దాన్ని తట్టుకునే విధంగా ఉండేందుకు ఇయర్ ప్రొటెక్టర్లను, హెలికాప్టర్ ల్యాండింగ్స్, ఇసుక తుఫానుల్లో కళ్లను కాపాడేందుకు కళ్లజోడు, ప్రమాదకరమైన పదార్ధాల మీద, వంకరటింకర దారుల్లో నడవడానికి సైనికుల లాగా ఉండే బూట్లను జాగిలాలకు అందుబాటులోకి తెచ్చారు.
మిడిల్ ఈస్ట్ నుంచి తీసుకున్న ఈ జాగిలాలను ప్రపంచంలోని అన్ని వాతావరణ పరిస్థితులకు తట్టుకునేలా శిక్షణ ఇస్తారు. మొత్తం 75 రోజుల శిక్షణలో 35 కుక్కలకు సగటున 600 గ్రాముల ఆహారాన్ని అందిస్తారు. శిక్షణ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే మిలటరీలో పనిచేసే జాగిలాలన్నీ శిబిరాలకు అలవాటు పడిపోతాయని వాటి సంరక్షకుడు హుడ్ చెప్పారు.
ఇప్పటివరకు బ్రిటీష్ మిలటరీకు చెందిన జాగిలాలు ఉత్తర ఐర్లాండ్, బోస్నియా, కొసోవో, ఇరాక్, ఆప్ఘనిస్తాన్లలో పని చేశాయి. పేలుడు పదార్ధాలు, మారణ ఆయుధాలు, శత్రువులు సమీపిస్తున్న విషయాలను సైనికులకు అందించాయి.