
నదిలో పడిన బస్సు.. 20 మంది మృతి
ఖాట్మండు: నేపాల్‌లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందగా.. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాజధాని ఖాట్మండుకు 120 కిలోమీటర్ల దూరంలోని చండీబంజంగ్ ప్రాంతంలో బస్సు 100 మీటర్ల ఎత్తులో నుంచి త్రిశోలి నదిలో పడిందని పోలీసు అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
నేపాల్ పర్వత ప్రాంతాల్లో అస్తవ్యస్తమైన రోడ్లతో పాటు, ప్రమాణాలు లోపించిన వాహనాలు తరచూ ప్రమాదాలకు కారణమౌతున్నాయి. ఇటీవల ఓ బస్సు లోయలో పడిన ఘటనలో 36 మంది మృతి చెందగా.. 28 మంది గాయపడ్డారు.