
నల్లధనంపై సహకారమే కీలకం
- జీ20లో ఆ అంశాన్నే ప్రముఖంగా ప్రస్తావించనున్న ప్రధాని మోదీ
- ప్రజల జీవన ప్రమాణాల వృద్ధిపైనా దృష్టి పెట్టాలని సూచన!
- బ్రిస్బేన్‌లో బ్రిటన్, జపాన్ ప్రధానులతో భేటీ
బ్రిస్బేన్: బ్రిస్బేన్‌లో నేటి(శనివారం) నుంచి ప్రారంభంకానున్న జీ20 శిఖరాగ్ర సదస్సులో నల్లధనం వెలికితీతలో అత్యంతావశ్యకమైన అంతర్జాతీయ సహకారం అంశాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రముఖంగా లేవనెత్తనున్నారు. భారతీయులు విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న నల్లధనాన్ని భారత్‌కు తిరిగిరప్పించేందుకు కృషి చేస్తున్న మోదీ.. అందుకు ప్రపంచదేశాల సహకారం కోసం ఈ 9వ జీ20 సదస్సు వేదికగా ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు. అలాగే, కేవలం ఆరోగ్య, ఆర్థిక రంగాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టడం కాకుండా.. ఉపాధి కల్పనకు దారితీసే ఆర్థికవృద్ధి, తద్వారా ప్రజల జీవన ప్రమాణాల్లో సమూల మార్పునకు జీ20 కృషి చేయాలన్న విషయాన్ని ఈ సదస్సులో మోదీ ప్రస్తావించనున్నారు.
డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ప్రజలందరికీ అందుబాటులో స్వచ్ఛమైన విద్యుత్ తదితర భవిష్యత్ తరాలకు ఉపయోగపడే మౌలిక వసతుల కల్పన అంశాన్ని కూడా సభ్య దేశాల దృష్టికి తేవాలని మోదీ భావిస్తున్నారు. జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం ఆస్ట్రేలియా చేరుకున్నారు. ఆయనకు క్వీన్స్‌లాండ్ ప్రభుత్వాధినేత క్యాంప్‌బెల్ న్యూమన్, ఆస్ట్రేలియాలో భారత హైకమిషనర్ బీరేన్ నందా తదితరులు స్వాగతం పలికారు. జీ20లో భారత్, యూరోపియన్ యూనియన్‌తో పాటు అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మ నీ, ఇండోనేసియా, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యూకే, అమెరికాలు సభ్యదేశాలు.
ప్రపంచ జీడీపీలో దాదాపు 85%, ప్రపం చ వాణిజ్యంలో 80%, మూడింట రెండొంతుల ప్రపంచ జనాభాకు జీ20 ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన.. ఈ రెండు ఈ సదస్సులో ప్రధానంగా చర్చకు రానున్నాయని జీ20 కోశాధికారి జో హాకీ వెల్లడించారు. 2018 నాటికి ప్రపంచ ఆర్థిక వృద్ధిలో కనీసం 2% జీ20 దేశాల వాటాగా ఉండాలని సదస్సు అధ్యక్ష హోదాలో ఆస్ట్రేలియా ఆశిస్తోందన్నారు. ఆస్ట్రేలియాలో మోదీ బ్రిస్బేన్, మెల్‌బోర్న్, సిడ్నీ, కాన్‌బెర్రాల్లో పర్యటించనున్నారు. 161 ఏళ్ల మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో మంగళవారం జరగనున్న కార్యక్రమంలో 2015 క్రికెట్ ప్రపంచ కప్‌తో భారత్, అస్ట్రేలియాల ప్రధానులు మోదీ, ఎబాట్‌లు ఫొటోలు దిగనున్నారు. 1986లో నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ పర్యటన అనంతరం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత ప్రధాని మోదీనే.
ఒబామా, ప్రపంచ నేతల ప్రశంసలు: ఆహార సబ్సిడీల సమస్యకు సంబంధించి ‘డబ్ల్యూటీవో వాణిజ్య సౌలభ్య ఒప్పందం’పై ఒక అవగాహనకు రావడంపై భారత ప్రధాని నరేంద్రమోదీని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రశంసల్లో ముంచెత్తారు. ఈ విషయంలో మోదీ చూపిన వ్యక్తిగత నాయకత్వ పాత్ర ప్రశంసనీయమన్నారు. ఈ ఒప్పందం ద్వారా భారత్, అమెరికాలు డబ్ల్యూటీవోకు నూతనోత్తేజాన్ని ఇచ్చాయని డబ్ల్యూటీవో సెక్రటరీ జనరల్ రొబర్టో అజెవెడొ వ్యాఖ్యానించారు. బ్రిస్బేన్‌లో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కేమరాన్, జపాన్ ప్రధాని షింజే ఎబే, యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు హెర్మన్ వాన్‌లతో మోదీ వేర్వేరుగా భేటీ అయ్యారు. బ్రిటన్‌లో పర్యటించాల్సిందిగా మోదీని కేమరాన్ ఆహ్వానించారు. కాగా, మోదీ గౌరవార్థం శుక్రవారం బ్రిస్బేన్‌లో షింజో ఎబే విందు ఏర్పాటు చేశారు.
యోగా డేకు మద్దతు: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలన్న మోదీ ప్రతిపాదనను హెర్మన్ వాన్ స్వాగతించారు. కాగా, జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా పాటించాలని పేర్కొంటూ ఐక్యరాజ్య సమితిలో ఒక ముసాయిదా తీర్మానాన్ని భారత్ రూపొందిస్తుంది. దానిపై సహ స్పాన్సర్లుగా అమెరికా, చైనా సహా 130 దేశాలు ఇప్పటికే సంతకాలు చేశాయి. ప్రపంచ దేశాల అధినేతలతో భేటీల్లో.. మోదీ తరచూ యోగా ప్రాముఖ్యతను, లాభాలను ప్రస్తావిస్తుండటం తెలిసిందే.
పీఓకే లేని భారత పటం
బ్రిస్బేన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా క్వీన్స్‌లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ(క్యూయూటీ)లో ఏర్పాటు చేసిన భారతదేశ పటంలో కాశ్మీర్‌ను సంపూర్ణంగా చూపకుండా నిర్వాహకులు దుశ్చర్యకు పాల్పడ్డారు. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించడంతో.. నిర్వాహకులు క్షమాపణలు తెలిపారు. మోదీ పాల్గొన్న కార్యక్రమంలో ప్రదర్శించిన భారతదేశ పటంలో ‘పాక్ ఆక్రమిత కాశ్మీర్’ను భారత్‌లో అంతర్భాగంగా చూపలేదు. అధికారిక భారతదేశ పటాల్లో పీఓకే అంతర్భాగంగానే ఉంటుంది. దీనిపై అనంతరం క్యూయూటీ క్షమాపణలు తెలిపింది. ఈ అంశంపై విదేశాంగ కార్యదర్శి సుజాతాసింగ్ తీవ్రంగా స్పందించడంతో నిర్వాహకులు క్షమాపణలు కోరారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అక్బరుద్దీన్ తెలిపారు.
రోబోకు ఆటోగ్రాఫ్: క్యూయూటీ సందర్శన సందర్భంగా మోదీ అక్కడి విద్యార్థుల్లో ఒకరిగా కలసిపోయారు. వారితో ఫొటోలు దిగారు. దాంతో విద్యార్థులు మురిసిపోయారు. నెహ్రూ జయంతి రోజు పిల్లలతో గడిపే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తునానని మోదీ వ్యాఖ్యానించారు. యూనివర్సిటీ క్యాంపస్ అంతా సందర్శించిన మోదీ.. అక్కడి ‘వ్యవసాయ రోబో(అగ్‌బోట్)’ను పరిశీలించారు. ఆ అగ్‌బోట్‌కు ఆటోగ్రాఫ్ ఇచ్చారు.