డాక్టర్ సంజీత్ సింగ్ సలూజా(కర్టెసీ: ఎంయూహెచ్‌సీ)
ఒట్టావా: ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19)పై పోరాటంలో ముందుండి నడుస్తున్న వైద్య సిబ్బంది వెలకట్టలేని త్యాగాలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ అహర్నిషలు రోగుల సేవలో నిమగ్నమవుతున్నారు. తమకు, తమ ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా ఎల్లప్పుడు మాస్కు ధరించడం వల్ల ముఖంపై గాయాలు అవుతున్నా లెక్కచేయడం లేదు. తాజాగా ఇద్దరు సిక్కు సోదరులు మహహ్మారిపై పోరులో భాగంగా తమ ఆచారాన్ని పక్కన పెట్టి నిజమైన హీరోలుగా నిలిచారు. మానవత్వాన్ని మించిన మతం లేదని మరోసారి నిరూపించారు. ఆచార వ్యవహారాల దృష్ట్యా సిక్కులు గడ్డం పెంచడం ఎంత ముఖ్యమో దాదాపు అందరికీ తెలిసిన విషయమే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మాస్కు ధరించడానికి అడ్డంగా ఉన్న గడ్డాన్ని తీసేసిన సిక్కు సోదరులు ఇద్దరు.. నిరాటంకంగా విధులు నిర్వర్తిస్తున్నారు. (ఎక్కువ మంది చనిపోతారు.. మాస్కు పెట్టుకోను)
కెనడాలో నివసించే సంజీత్ సింగ్ సలూజా మాంట్రియల్‌లోని మెక్‌గిల్ యూనివర్సిటీ హెల్త్ సెంటర్‌లో ఎమర్జెన్సీ రూం ఫిజీషియన్‌గా పనిచేస్తున్నారు. ఆయన సోదరుడు రజీత్ సింగ్ కూడా అదే ఆస్పత్రిలో న్యూరో సర్జన్‌గా సేవలు అందిస్తున్నారు. అయితే కరోనా పేషెంట్లకు సేవలు అందించే క్రమంలో విధిగా మాస్కులు ధరించాల్సి ఉన్నందున వారు తమ గడ్డాన్ని తీసేసినట్లు సంజీత్ తెలిపారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘‘దేవుడు సృష్టిని గౌరవిస్తూ.. సహజంగా పెరిగే కేశాలను సంరక్షించుకోవడం.. వాటిని అలాగే పెరగనీయడం ఆచారం. అయితే ప్రస్తుతం కోవిడ్-19 వ్యాపిస్తున్నందున ఎన్-95 మాస్కు ధరించాలి.
సేవా లేదా కేశాలా అనే రెండు ఆప్షన్లు మా ముందు ఉన్నపుడు సిక్కు మత విశ్వాస మూల స్తంభమైన సేవనే మేం ఎంచుకున్నాం. కాబట్టి షేవ్ చేశాం. రోగులకు అందుబాటులో ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని పేర్కొన్నారు. ఇక కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు ఇంతటి త్యాగానికి పూనుకుని.. కఠిన నిర్ణయం తీసుకున్న సిక్కు సోదరులకు ధన్యవాదాలు చెబుతున్నామని ఆస్పత్రి యాజమాన్యం ఓ లేఖను విడుదల చేసింది. కాగా మంగళవారం నాటికి కెనడాలో కరోనా మరణాల సంఖ్య 3,915కు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment