సిక్కుమంత్రిపై అనుచిత వ్యాఖ్యలతో దుమారం
టొరంటో: కెనడా తొలి సిక్కు రక్షణ మంత్రి హర్జిత్ సజ్జన్ (45)కు ఆ దేశ పార్లమెంటులో అవమానం ఎదురైంది. భారత సంతతికి చెందిన హర్జిత్ గురువారం పార్లమెంటులో ప్రసంగిస్తున్న సమయంలో విపక్ష కన్జర్వేటివ్ సభ్యుడు, మాజీ రక్షణ మంత్రి జాసన్ కెన్నీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయంలో ఐస్ ఐఎస్కు వ్యతిరేకంగా ప్రభుత్వం ఆపరేషన్ పై వివరణ ఇస్తుండగా అకస్మాత్తుగా కెన్నీ విరుచుకుపడ్డాడు. సభలోని సభ్యులకు ఇంగ్లీషు నుంచి ఇంగ్లీషుకు తర్జుమా చేసి వివరించే అనువాదకుడు అవసరమంటూ గందరగోళం సృష్టించారు. హర్జిత్ భాష తమకు అర్థం కావడం లేదంటూ మంత్రిని ఎగతాళి చేయడం వివాదం రేపింది.
జాసన్ కెన్నీ వ్యాఖ్యలను అధికార లిబరల్ పార్టీ సభ్యులు ఖండించారు. ఇది జాత్యహంకారమేనని ఆయనపై విరుచుకుపడ్డారు. జాతి వివక్ష వ్యాఖ్యలను తక్షణం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కానీ సభలో కెన్నీ సారీ చెప్పేందుకు నిరాకరించారు. కెన్నీ వైఖరిని పలువురు పార్లమెంటు సభ్యులు, మేధావులు తప్పుబట్టారు. కెన్నీ వ్యాఖ్యలను భారత సంతతికి చెందిన మరో మంత్రి రూబీ సహోటా తీవ్రంగా ఖండించారు. మంత్రిపై వివక్షాపూరిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. క్షమాపణ చెప్పడానికి నిరాకరించిన ఆయన వైఖరిని సమర్ధనీయంకాదన్నారు. అయితే దీనిపై క్షమాపణ చెప్పడానికి నిరాకరించిన కెన్నీట్విట్టర్ లో స్పందించారు. రక్షణ మంత్రి సమాధానం పూర్తిగా అసంబద్ధంగా ఉందంటూ తన వైఖరిని సమర్ధించుకుంటూనే, తన వ్యాఖ్యలు బాధపెట్టి ఉంటే క్షమించాలని ట్విట్ చేశారు.
కాగా భారతదేశంలో పుట్టిన హర్జిత్ సజ్జన్ కు ఐదేళ్ల వయసు ఉన్నపుడు వారి కుటుంబం కెనడాకు వలస వెళ్లింది. గత నవంబరులో జరిగిన ఎన్నికల్లో లిబరల్ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఆయనకు గల అనుభవానికి గుర్తింపుగా ప్రధాని జస్టిన్ ట్రూడో తన మంత్రివర్గంలో రక్షణమంత్రిగా నియమించి ఆయనను గౌరవించారు. కెనడా సైన్యంలో సజ్జన్ కు అపారమైన అనుభవం ఉంది. బోస్నియా, కాందహార్, అఫ్గానిస్థాన్లలో తీవ్రవాదులతో పోరాడిన వీర సైనికుడిగా గుర్తింపు దక్కించుకున్నారు.