racist remark
-
సిక్కుమంత్రిపై అనుచిత వ్యాఖ్యలతో దుమారం
టొరంటో: కెనడా తొలి సిక్కు రక్షణ మంత్రి హర్జిత్ సజ్జన్ (45)కు ఆ దేశ పార్లమెంటులో అవమానం ఎదురైంది. భారత సంతతికి చెందిన హర్జిత్ గురువారం పార్లమెంటులో ప్రసంగిస్తున్న సమయంలో విపక్ష కన్జర్వేటివ్ సభ్యుడు, మాజీ రక్షణ మంత్రి జాసన్ కెన్నీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయంలో ఐస్ ఐఎస్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం ఆపరేషన్ పై వివరణ ఇస్తుండగా అకస్మాత్తుగా కెన్నీ విరుచుకుపడ్డాడు. సభలోని సభ్యులకు ఇంగ్లీషు నుంచి ఇంగ్లీషుకు తర్జుమా చేసి వివరించే అనువాదకుడు అవసరమంటూ గందరగోళం సృష్టించారు. హర్జిత్ భాష తమకు అర్థం కావడం లేదంటూ మంత్రిని ఎగతాళి చేయడం వివాదం రేపింది. జాసన్ కెన్నీ వ్యాఖ్యలను అధికార లిబరల్ పార్టీ సభ్యులు ఖండించారు. ఇది జాత్యహంకారమేనని ఆయనపై విరుచుకుపడ్డారు. జాతి వివక్ష వ్యాఖ్యలను తక్షణం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కానీ సభలో కెన్నీ సారీ చెప్పేందుకు నిరాకరించారు. కెన్నీ వైఖరిని పలువురు పార్లమెంటు సభ్యులు, మేధావులు తప్పుబట్టారు. కెన్నీ వ్యాఖ్యలను భారత సంతతికి చెందిన మరో మంత్రి రూబీ సహోటా తీవ్రంగా ఖండించారు. మంత్రిపై వివక్షాపూరిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. క్షమాపణ చెప్పడానికి నిరాకరించిన ఆయన వైఖరిని సమర్ధనీయంకాదన్నారు. అయితే దీనిపై క్షమాపణ చెప్పడానికి నిరాకరించిన కెన్నీట్విట్టర్ లో స్పందించారు. రక్షణ మంత్రి సమాధానం పూర్తిగా అసంబద్ధంగా ఉందంటూ తన వైఖరిని సమర్ధించుకుంటూనే, తన వ్యాఖ్యలు బాధపెట్టి ఉంటే క్షమించాలని ట్విట్ చేశారు. కాగా భారతదేశంలో పుట్టిన హర్జిత్ సజ్జన్ కు ఐదేళ్ల వయసు ఉన్నపుడు వారి కుటుంబం కెనడాకు వలస వెళ్లింది. గత నవంబరులో జరిగిన ఎన్నికల్లో లిబరల్ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఆయనకు గల అనుభవానికి గుర్తింపుగా ప్రధాని జస్టిన్ ట్రూడో తన మంత్రివర్గంలో రక్షణమంత్రిగా నియమించి ఆయనను గౌరవించారు. కెనడా సైన్యంలో సజ్జన్ కు అపారమైన అనుభవం ఉంది. బోస్నియా, కాందహార్, అఫ్గానిస్థాన్లలో తీవ్రవాదులతో పోరాడిన వీర సైనికుడిగా గుర్తింపు దక్కించుకున్నారు. -
గిరిరాజ్ సింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశం
పాట్నా: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని గురువారం స్థానిక బీహార్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర బీహార్ కు చెందిన కాంగ్రెస్ నాయకుడు విద్యానంద్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఈ మేరకు స్పందించింది. గిరిరాజ్ సింగ్ పై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారం రోజుల్లోగా నివేదిక అందజేయాలని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ పోలీసులను ఆదేశించారు. తొలుత ఈ పిటిషన్ ముజాఫర్ నగర్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్టేట్ ముందుకు వస్తే దీనిపై విచారణను అక్కడి నుంచిసబ్ డివిజనల్ కోర్టుకు బదిలీ చేశారు. సోనియా తెలుపు రంగులో లేనట్లయితే, రాజీవ్ గాంధీ ఓ నైజీరియా మహిళను పెళ్లాడి ఉన్నట్లయితే, ఆమె తెలుపు రంగు మహిళ కానట్లయితే కాంగ్రెస్ ఆమె నాయకత్వాన్ని అంగీకరించేదా?’ అని గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. -
'తెల్ల చర్మం వల్లే అధ్యక్షురాలయ్యారు'
కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపైనే చిత్తం వచ్చినట్లు మాట్లాడారు. ‘సోనియా తెలుపు రంగులో లేనట్లయితే, రాజీవ్ గాంధీ ఓ నైజీరియా మహిళను పెళ్లాడి ఉన్నట్లయితే, ఆమె తెలుపు రంగు మహిళ కానట్లయితే కాంగ్రెస్ ఆమె నాయకత్వాన్ని అంగీకరించేదా?’ అని గిరిరాజ్ సింగ్ మంగళవారం బిహార్‌లోని హాజీపూర్‌లో విలేకర్లతో అన్నారు. గిరిరాజ్ మాటలపై కాంగ్రెస్ సహా జాతీయ స్థాయిలో మహిళా నేతలు, మహిళా సంఘాలు తీవ్రంగా స్పందించాయి. కేంద్ర కేబినెట్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సహాయ మంత్రిగా ఉన్న గిరిరాజ్‌ను ప్రధాని నరేంద్రమోదీ వెంటనే బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. గిరిరాజ్ వ్యాఖ్యలు ఆయన జాత్యహంకార ధోరణిని, మహిళల పట్ల ఆయనకున్న వైఖరిని వ్యక్తం చేస్తున్నాయని పలువురు మహిళానేతలు ఆరోపించారు. హాజీపూర్‌లో సోనియాపై విమర్శలు గుప్పించడమే కాకుండా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బడ్జెట్ సమావేశాలకు హాజరుకాకపోవటంపైనా గిరిరాజ్ అతిగా స్పందించారు. ‘కాంగ్రెస్ అధికారంలో ఉండి ఉంటే రాహుల్ ప్రధాని అయ్యేవారు. ఏదో కారణంతో ప్రధాని 47 రోజుల పాటు అదృశ్యమైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడి అదృశ్యం కూడా మలేసియా విమానం మాయం కావటం లాంటిదే’ అని అన్నారు. గిరిరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలచేయడం ఇది తొలిసారి కాదు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్రమోదీని వ్యతిరేకించే వారు పాకిస్తాన్‌కు వెళ్లిపోవాలని అన్నారు. బుధవారం ఢిల్లీకి వచ్చిన గిరిరాజ్‌ను తాజా వివాదంపై స్పందించమని కోరగా తొలుత నిరాకరించారు. వివాదం ముదిరిపోవటంతో మాట్లాడారు. తన వ్యాఖ్యలు సోనియా, రాహుల్‌లను బాధపెట్టినట్లయితే అందుకు విచారిస్తున్నానన్నారు. తాను ‘ఆఫ్‌ది రికార్డ్’గా మాట్లాడిన మాటల్ని మీడియా రాద్ధాంతం చేసిందన్నారు. కాగా సోనియాపై గిరిరాజ్ వ్యాఖ్యలను ఆమె అల్లుడు రాబర్ట్ వాద్రా ఖండించారు. దేశంలో గౌరవప్రద హోదాలో ఉన్న మహిళ గురించి కేంద్రమంత్రి మాట్లాడే పద్ధతి ఇదేనా ఫేస్బుక్ లో విమర్శించారు. గిరిరాజ్‌ను బీజేపీ చీఫ్ అమిత్‌షా ఫోన్లో మందలించారు. మరోవైపు పట్నాలో గిరిరాజ్ ఇంటిముందు కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. టొమాటోలు, కోడిగుడ్లను ఇంటిపైకి విసిరారు. నైజీరియా ఆగ్రహం.. తమ దేశపు మహిళలను కించపరిచే విధంగా కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించటంపై భారత్‌లోని నైజీరియా దౌత్యకార్యాలయం తీవ్రంగా ఖండించింది. తమ దేశానికి మంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. -
విద్యార్థిపై జాతివివక్ష: ఇద్దరు యువకులు అరెస్టు
న్యూఢిల్లీ: జాతివివక్ష చూపిస్తున్న ఆరోపణలపై ఇద్దరు విద్యార్థులను అరెస్టు చేసిన ఘటన ఉత్తర ఢిల్లీలో చోటు చేసుకుంది. ఈశాన్య రాష్ట్ర విద్యార్థిపై జాతివివక్ష చూపిస్తున్నారన్న ఆరోపణపై ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు ఆదివారం పోలీసులు తెలిపారు. బీహార్‌కు చెందిన ఛప్రా ప్రాంత వాసులైన అమిత్‌కుమార్, ఆకాశ్కుమార్లు తనపై వివక్షపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని శనివారం అర్ధరాత్రి ఈశాన్య రాష్ట్రవాసి అయిన హేమాంగ్ హూకూప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉత్తర ఢిల్లీలో ఉన్న ఢిల్లీ యూనివర్సిటీ ఉత్తర క్యాంపస్ సమీపంలో మౌరీస్ నగర్లో బాధితుడు, నిందితులు పక్కపక్క నివాసాల్లో ఉంటున్నారని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.