Harjit Sajjan
-
సిక్కుమంత్రిపై అనుచిత వ్యాఖ్యలతో దుమారం
టొరంటో: కెనడా తొలి సిక్కు రక్షణ మంత్రి హర్జిత్ సజ్జన్ (45)కు ఆ దేశ పార్లమెంటులో అవమానం ఎదురైంది. భారత సంతతికి చెందిన హర్జిత్ గురువారం పార్లమెంటులో ప్రసంగిస్తున్న సమయంలో విపక్ష కన్జర్వేటివ్ సభ్యుడు, మాజీ రక్షణ మంత్రి జాసన్ కెన్నీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయంలో ఐస్ ఐఎస్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం ఆపరేషన్ పై వివరణ ఇస్తుండగా అకస్మాత్తుగా కెన్నీ విరుచుకుపడ్డాడు. సభలోని సభ్యులకు ఇంగ్లీషు నుంచి ఇంగ్లీషుకు తర్జుమా చేసి వివరించే అనువాదకుడు అవసరమంటూ గందరగోళం సృష్టించారు. హర్జిత్ భాష తమకు అర్థం కావడం లేదంటూ మంత్రిని ఎగతాళి చేయడం వివాదం రేపింది. జాసన్ కెన్నీ వ్యాఖ్యలను అధికార లిబరల్ పార్టీ సభ్యులు ఖండించారు. ఇది జాత్యహంకారమేనని ఆయనపై విరుచుకుపడ్డారు. జాతి వివక్ష వ్యాఖ్యలను తక్షణం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కానీ సభలో కెన్నీ సారీ చెప్పేందుకు నిరాకరించారు. కెన్నీ వైఖరిని పలువురు పార్లమెంటు సభ్యులు, మేధావులు తప్పుబట్టారు. కెన్నీ వ్యాఖ్యలను భారత సంతతికి చెందిన మరో మంత్రి రూబీ సహోటా తీవ్రంగా ఖండించారు. మంత్రిపై వివక్షాపూరిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. క్షమాపణ చెప్పడానికి నిరాకరించిన ఆయన వైఖరిని సమర్ధనీయంకాదన్నారు. అయితే దీనిపై క్షమాపణ చెప్పడానికి నిరాకరించిన కెన్నీట్విట్టర్ లో స్పందించారు. రక్షణ మంత్రి సమాధానం పూర్తిగా అసంబద్ధంగా ఉందంటూ తన వైఖరిని సమర్ధించుకుంటూనే, తన వ్యాఖ్యలు బాధపెట్టి ఉంటే క్షమించాలని ట్విట్ చేశారు. కాగా భారతదేశంలో పుట్టిన హర్జిత్ సజ్జన్ కు ఐదేళ్ల వయసు ఉన్నపుడు వారి కుటుంబం కెనడాకు వలస వెళ్లింది. గత నవంబరులో జరిగిన ఎన్నికల్లో లిబరల్ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఆయనకు గల అనుభవానికి గుర్తింపుగా ప్రధాని జస్టిన్ ట్రూడో తన మంత్రివర్గంలో రక్షణమంత్రిగా నియమించి ఆయనను గౌరవించారు. కెనడా సైన్యంలో సజ్జన్ కు అపారమైన అనుభవం ఉంది. బోస్నియా, కాందహార్, అఫ్గానిస్థాన్లలో తీవ్రవాదులతో పోరాడిన వీర సైనికుడిగా గుర్తింపు దక్కించుకున్నారు. -
ఫేస్బుక్లో మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు
టొరంటో: కెనడా రక్షణ మంత్రికీ జాతి వివక్ష తప్పలేదు. కెనడా కొత్త రక్షణ మంత్రి హర్జీత్ సజ్జన్‌ను ఉద్దేశిస్తూ ఓ సైనికుడు సోషల్ మీడియాలో జాతి వివక్ష వ్యాఖ్యలు పోస్ట్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై కెనడా సైనిక దళాలు విచారణ ప్రారంభించాయి. హర్జీత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సైనికుడి పేరు, ఏ వ్యాఖ్యలు చేశారన్న వివరాలను వెల్లడించేందుకు సైన్యం నిరాకరించింది. అయితే మంత్రిపై తీవ్ర వ్యాఖ్యలను ఫేస్బుక్లో పోస్ట్ చేసినట్టు విచారణ కమిటీ సభ్యుడొకరు తెలిపారు. ఫేస్బుక్లో ఫ్రెంచి భాషలో రాసిన ఈ కామెంట్స్‌ను వెంటనే తొలగించారు. కెనడా రక్షణ మంత్రిగా భారత సంతతికి చెందిన హర్జీత్ సజ్జన్ నియమితులైన సంగతి తెలిసిందే. -
కెనడా రక్షణ మంత్రి మనోడే!
ఒట్టావా: కెనడా నూతన రక్షణశాఖ మంత్రిగా భారత సంతతికి చెందిన సిక్కు హర్జిత్ సజ్జన్ గురువారం ప్రమాణం చేశారు. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడో నేతృత్వంలో 30 మందితో కూడిన క్యాబినెట్ బృందం గురువారం ఒట్టావాలో అట్టహాసంగా ప్రమాణం స్వీకరించిది. ఈ 30 మంది క్యాబినెట్ బృందంలో సజ్జన్ ఒకరు. లెఫ్టినెంట్ కల్నల్‌గా కెనడా ఆర్మీలో పనిచేసిన ఆయన ఇటీవలి ఎన్నికల్లో వాంకోవర్ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. కెనడా సైన్యంలో విశేష సేవలందించిన సజ్జన్ గతంలో బొస్నియాతోపాటు ఆఫ్గనిస్థాన్లోని కాందహార్‌లో పనిచేశారు. కాందహార్ ప్రాంతంలో సైనికాధికారిగా పనిచేసిన సమయంలో అక్కడ తాలిబన్ ప్రభావాన్ని తగ్గించేందుకు గణనీయంగా కృషిచేశారు. ఇందుకుగాను 2013లో ఆయనకు మెరిటోరియస్ సర్వీస్ మెడల్ పొందారు. 'స్థానిక సంస్కృతులు, గిరిజన ఆచార వ్యవహారాలు తెలిసిన వ్యక్తిగా ఆయన ఆఫ్గన్ గిరిజన నాయకులతో చర్చలు జరిపేందుకు సీనియర్ అధికారులకు సహాయపడ్డారు. తద్వారా అక్కడ తిరుగుబాటుదారులపై సైన్యం పైచేయి సాధించేందుకు తోడ్పడ్డారు' అని ఈ మెడల్‌కు సంబంధించిన ప్రశంసాపత్రంలో ప్రభుత్వం ఆయన సేవలను కొనియాడింది. 45 ఏళ్ల సజ్జన్ పుట్టింది భారత్‌లోనే. ఆయన ఐదేళ్ల వయస్సుండగా ఆయన కుటుంబం భారత్ నుంచి కెనడా వలసవచ్చింది. దాదాపు 50 ఏళ్ల కిందట తన తండ్రి చేపటిన ప్రధాని పదవిని ప్రస్తుతం జస్టిన్ ట్రుడో చేపడుతుండటం.. ఆయనపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టే సమర్థమైన క్యాబినెట్ బృందంతో ట్రుడో ఒట్టావోలోని రిడ్యూ హాల్లో కెనడా 29వ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. కెనడా ప్రస్తుతం ఇరాక్, సిరియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై పోరాడుతున్న నేపథ్యంలో కొత్త రక్షణమంత్రిగా సజ్జన్‌పై పెద్ద బాధ్యతే ఉంది.