కెనడా రక్షణ మంత్రి మనోడే!
ఒట్టావా: కెనడా నూతన రక్షణశాఖ మంత్రిగా భారత సంతతికి చెందిన సిక్కు హర్జిత్ సజ్జన్ గురువారం ప్రమాణం చేశారు. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడో నేతృత్వంలో 30 మందితో కూడిన క్యాబినెట్ బృందం గురువారం ఒట్టావాలో అట్టహాసంగా ప్రమాణం స్వీకరించిది. ఈ 30 మంది క్యాబినెట్ బృందంలో సజ్జన్ ఒకరు. లెఫ్టినెంట్ కల్నల్‌గా కెనడా ఆర్మీలో పనిచేసిన ఆయన ఇటీవలి ఎన్నికల్లో వాంకోవర్ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు.
కెనడా సైన్యంలో విశేష సేవలందించిన సజ్జన్ గతంలో బొస్నియాతోపాటు ఆఫ్గనిస్థాన్‌లోని కాందహార్‌లో పనిచేశారు. కాందహార్ ప్రాంతంలో సైనికాధికారిగా పనిచేసిన సమయంలో అక్కడ తాలిబన్ ప్రభావాన్ని తగ్గించేందుకు గణనీయంగా కృషిచేశారు. ఇందుకుగాను 2013లో ఆయనకు మెరిటోరియస్ సర్వీస్ మెడల్ పొందారు. 'స్థానిక సంస్కృతులు, గిరిజన ఆచార వ్యవహారాలు తెలిసిన వ్యక్తిగా ఆయన ఆఫ్గన్ గిరిజన నాయకులతో చర్చలు జరిపేందుకు సీనియర్ అధికారులకు సహాయపడ్డారు. తద్వారా అక్కడ తిరుగుబాటుదారులపై సైన్యం పైచేయి సాధించేందుకు తోడ్పడ్డారు' అని ఈ మెడల్‌కు సంబంధించిన ప్రశంసాపత్రంలో ప్రభుత్వం ఆయన సేవలను కొనియాడింది. 45 ఏళ్ల సజ్జన్ పుట్టింది భారత్‌లోనే. ఆయన ఐదేళ్ల వయస్సుండగా ఆయన కుటుంబం భారత్ నుంచి కెనడా వలసవచ్చింది.
దాదాపు 50 ఏళ్ల కిందట తన తండ్రి చేపటిన ప్రధాని పదవిని ప్రస్తుతం జస్టిన్ ట్రుడో చేపడుతుండటం.. ఆయనపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టే సమర్థమైన క్యాబినెట్ బృందంతో ట్రుడో ఒట్టావోలోని రిడ్యూ హాల్‌లో కెనడా 29వ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. కెనడా ప్రస్తుతం ఇరాక్, సిరియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై పోరాడుతున్న నేపథ్యంలో కొత్త రక్షణమంత్రిగా సజ్జన్‌పై పెద్ద బాధ్యతే ఉంది.