heckled
-
కేజ్రీవాల్‌కు అవమానం.. సాయం చేసిన బీజేపీ మంత్రి
న్యూఢిల్లీ : అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆకతాయిల చేతిలో టార్గెట్ అవుతూనే ఉన్నారు అరవింద్ కేజ్రీవాల్. ఇంక్ నుంచి కారం పొడి చల్లడం వరకూ అన్ని రకాల అవమానాలు చవి చూశారు. కానీ గురువారం కేజ్రీవాల్‌కు ఎదురైన పరాభవం వీటన్నింటిని మించింది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘క్లీన్ గంగ’ కార్యక్రమం మాదిరిగానే యుమునా నదిని కూడా శుభ్రం చేయాలనే ఉద్దేశంతో కేజ్రీవాల్ ప్రభుత్వం ‘క్లీన్ యమున’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా గురువారం ఓ పబ్లిక్ మీటింగ్‌ను ఏర్పాటు చేశారు. దీనికి కేజ్రీవాల్‌తో పాటు కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, హర్ష వర్ధన్లు కూడా హాజరయ్యారు. కార్యక్రమం జరుగుతుండగా ముందు వరుసలో కూర్చున్న కొందరు వ్యక్తులు కేజ్రీవాల్ అనారోగ్యాన్ని ఎత్తి చూపుతూ దగ్గడం ప్రారంభించారు. ఫలితంగా అక్కడ కాస్తా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. తనను ఎగతాళి చేయడం కోసమే వారు అలా చేస్తున్నారని కేజ్రీవాల్‌కు అర్థమైనప్పటికి ఆయన మౌనంగానే ఉన్నారు. అప్పుడు అక్కడే ఉన్న బీజేపీ మంత్రులు నితిన్ గడ్కరీ, హర్ష వర్ధన్ దగ్గుతున్న వారి దగ్గరకు వెళ్లి ‘ఇది పబ్లిక్ మీటింగ్.. దయ చేసి మౌనంగా ఉండండ’ని విజ్ఞప్తి చేశారు. దాంతో పరిస్థితి కాస్తా సద్దుమణిగింది. కేజ్రీవాల్‌కు 40 ఏళ్ల నుంచి దగ్గు సమస్య ఉంది. అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో అది బాగా ఎక్కువయ్యింది. చికిత్స నిమిత్తం కేజ్రీవాల్ 2016, సెప్టెంబర్‌లో బెంగళూరు వెళ్లి ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. -
సిక్కుమంత్రిపై అనుచిత వ్యాఖ్యలతో దుమారం
టొరంటో: కెనడా తొలి సిక్కు రక్షణ మంత్రి హర్జిత్ సజ్జన్ (45)కు ఆ దేశ పార్లమెంటులో అవమానం ఎదురైంది. భారత సంతతికి చెందిన హర్జిత్ గురువారం పార్లమెంటులో ప్రసంగిస్తున్న సమయంలో విపక్ష కన్జర్వేటివ్ సభ్యుడు, మాజీ రక్షణ మంత్రి జాసన్ కెన్నీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయంలో ఐస్ ఐఎస్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం ఆపరేషన్ పై వివరణ ఇస్తుండగా అకస్మాత్తుగా కెన్నీ విరుచుకుపడ్డాడు. సభలోని సభ్యులకు ఇంగ్లీషు నుంచి ఇంగ్లీషుకు తర్జుమా చేసి వివరించే అనువాదకుడు అవసరమంటూ గందరగోళం సృష్టించారు. హర్జిత్ భాష తమకు అర్థం కావడం లేదంటూ మంత్రిని ఎగతాళి చేయడం వివాదం రేపింది. జాసన్ కెన్నీ వ్యాఖ్యలను అధికార లిబరల్ పార్టీ సభ్యులు ఖండించారు. ఇది జాత్యహంకారమేనని ఆయనపై విరుచుకుపడ్డారు. జాతి వివక్ష వ్యాఖ్యలను తక్షణం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కానీ సభలో కెన్నీ సారీ చెప్పేందుకు నిరాకరించారు. కెన్నీ వైఖరిని పలువురు పార్లమెంటు సభ్యులు, మేధావులు తప్పుబట్టారు. కెన్నీ వ్యాఖ్యలను భారత సంతతికి చెందిన మరో మంత్రి రూబీ సహోటా తీవ్రంగా ఖండించారు. మంత్రిపై వివక్షాపూరిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. క్షమాపణ చెప్పడానికి నిరాకరించిన ఆయన వైఖరిని సమర్ధనీయంకాదన్నారు. అయితే దీనిపై క్షమాపణ చెప్పడానికి నిరాకరించిన కెన్నీట్విట్టర్ లో స్పందించారు. రక్షణ మంత్రి సమాధానం పూర్తిగా అసంబద్ధంగా ఉందంటూ తన వైఖరిని సమర్ధించుకుంటూనే, తన వ్యాఖ్యలు బాధపెట్టి ఉంటే క్షమించాలని ట్విట్ చేశారు. కాగా భారతదేశంలో పుట్టిన హర్జిత్ సజ్జన్ కు ఐదేళ్ల వయసు ఉన్నపుడు వారి కుటుంబం కెనడాకు వలస వెళ్లింది. గత నవంబరులో జరిగిన ఎన్నికల్లో లిబరల్ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఆయనకు గల అనుభవానికి గుర్తింపుగా ప్రధాని జస్టిన్ ట్రూడో తన మంత్రివర్గంలో రక్షణమంత్రిగా నియమించి ఆయనను గౌరవించారు. కెనడా సైన్యంలో సజ్జన్ కు అపారమైన అనుభవం ఉంది. బోస్నియా, కాందహార్, అఫ్గానిస్థాన్లలో తీవ్రవాదులతో పోరాడిన వీర సైనికుడిగా గుర్తింపు దక్కించుకున్నారు. -
హెచ్‌సీయూలో మళ్లీ ఉద్రిక్తత
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యతో హెచ్‌సీయూలో మూడోరోజు మంగళవారం కూడా విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. హెచ్సీయూకు వచ్చిన బీజేపీ రాష్ట్ర సెక్రటరీ ప్రకాశ్ రెడ్డిని ఈ సందర్భంగా విద్యార్థులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొందరు విద్యార్థులు ప్రకాశ్ రెడ్డి వాహనంపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. వైస్ ఛాన్సలర్ అప్పారావును సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు. రోహిత్ ఆత్మహత్యకు బీజేపీనే కారణం, ప్రకాశ్ రెడ్డి గో బ్యాక్ అంటూ విద్యార్థులు ధ్వజమెత్తారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు పోలీసులు భారీగా మోహరించారు.