గాలిని బంధించి.. అమ్మేస్తున్నారు!
చైనాలో వాతావరణ కాలుష్యం తీవ్రస్థాయిలో ఉంది. ఆ పరిస్థితిని సొమ్ము చేసుకోడానికి కెనడాలో ఓ స్టార్టప్ కంపెనీ వినూత్నమైన ఆలోచన చేసింది. తమ దేశంలో పర్వతప్రాంత నగరమైన బాన్ఫ్ నుంచి తాజా గాలిని సేకరించి, దాన్ని క్యాన్లలో బంధించి చైనాకు ఎగుమతి చేస్తోంది. ఈ కంపెనీ పేరు వైటాలిటీ ఎయిర్. ఎందుకైనా మంచిదని తొలి బ్యాచ్‌లో కేవలం 500 క్యాన్లు మాత్రమే పంపగా, అవన్నీ రెండు వారాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి! అంతేకాదు.. తమకు ఈ గాలి క్యాన్లు పంపాలంటూ ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయని కంపెనీ డైరెక్టర్ హారిసన్ వాంగ్ తెలిపారు. ఇంతకీ ఈ గాలి క్యాన్ల ధర ఎంతో తెలుసా.. సైజును బట్టి 935 నుంచి 1337 రూపాయల వరకు ఉంది!!
ఉత్తర చైనాలో కలుషితమైన పొగమంచు చాలా ఎక్కువ. దీనివల్ల ఒక్కోసారి గాలి కూడా ఆడదు. ప్రధానంగా చలికాలంలో పవర్ ప్లాంట్లలోను, ఇళ్లలోను వెచ్చదనం కోసం బొగ్గు మండిస్తారు. దీనివల్ల వచ్చే పొగ, బయట ఉండే మంచు కలిసి కాలుష్యం తీవ్రంగా పెరిగిపోతుంది. ఈ పొగమంచు కారణంగా గతవారం బీజింగ్ తొలిసారి రెడ్ ఎలర్ట్ ప్రకటించి, స్కూళ్లకు సెలవులు ఇచ్చేసింది.
గత సంవత్సరం తాను ఈబేలో జిప్‌లాక్ చేసిన బ్యాగులో గాలిని అమ్మడం చూశానని, వాళ్లు దాని ధరను 99 సెంట్లుగా పెట్టారని.. అప్పుడే తనకు కూడా గాలిని ఎందుకు ఎగుమతి చేయకూడదన్న ఆలోచన వచ్చిందని వైటాలిటీ ఎయిర్ సహ వ్యవస్థాపకుడు మోజెస్ లామ్ చెప్పారు. తాము అమ్మేదే తాజా గాలి అయినప్పుడు.. దాన్ని ప్యాకింగ్ చేయడానికి మిషన్లు వాడితే ఆయిల్, గ్రీజు అంటుకుంటాయి కాబట్టి చేతులతోనే ప్యాక్ చేస్తున్నామని ఆయన అన్నారు. అందుకే దీనికి ఎక్కువ సమయం పడుతోందట. ముందుగా గాలి సేకరించి, అందులోంచి ప్రమాదకరమైన కణాలను తీసేయాల్సి ఉంటుంది.