ఉన్మాది విచక్షణ రహితంగా జరిపిన కాల్పులు.. నెత్తురొడ్డిన కార్యాలయం.. సహచరుల మృతి.. అయితే అంత పెనువిషాదంలోనూ ఆ సంస్థ ఉద్యోగులు పనిపై నిబద్ధతను కనబరిచారు. గంటల వ్యవధిలోనే పనిని తిరిగి ప్రారంభించారు. చనిపోయిన తమ సహచరుల ఆత్మశాంతి కోసం రేపు ప్రజల ముందుకు జరిగిన దారుణాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమైపోయారు.
అన్నాపొలిస్: మేరీల్యాండ్ రాజధానిలోని క్యాపిటల్ గెజిట్ పత్రిక కార్యాలయంపై ఉన్మాది విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన విషయం విదితమే. స్థానిక కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 2:35 సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. కార్యాలయంలోకి చొరబడ్డ ఉన్మాది కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ చేపట్టారు. అయితే అతను సహకరించటం లేదని తెలుస్తోంది.
పగ పెంచుకుని... ఫేస్ డికెక్టర్ ద్వారా అతని వివరాలు సేకరించిన పోలీసులు, కేసును దాదాపుగా చేధించినట్లు తెలుస్తోంది. నిందితుడిని లౌరెల్‌కు చెందిన జర్రోడ్ రామోస్(38)గా గుర్తించిన అధికారులు.. గతంలో క్యాపిటల్ గెజిట్‌పై సదరు నిందితుడు దావా వేసినట్లు చెబుతున్నారు. అయితే ఈ కేసును జడ్జి కొట్టివేయటంతో పగ పెంచుకుని మరీ ఈ దాడికి పాల్పడినట్లుగా భావిస్తున్నారు. అయితే దీనిపై అధికారికంగా ఇంకా ప్రకటన వెలువడలేదు. దీనికితోడు గత కొన్నిరోజులుగా పేపర్‌కు బెదిరింపు మెయిళ్లు వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో ఆ బెదిరింపులకు, రామోస్‌కు సంబంధం ఉందా? అన్న కోణం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అంత శోకంలోనూ... మృతుల్లో ఎడిటర్ హిస్సాయెన్(59) ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. తమ సహచరుల మృతుల వార్త తెలియగానే మిగతా సిబ్బంది ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. కాల్పుల ఘటన తర్వాత కేసు దర్యాప్తు నిమిత్తం పోలీసులు కార్యాలయాన్ని మూసివేశారు. అయితే అంత శోకంలోనూ ఈ ఘటనను కవర్ చేసేందుకే స్టాఫ్ నిర్ణయించుకున్నారు. ఆఫీస్ వెనకాల ఓ వ్యాన్‌లో కూర్చుని ముగ్గురు సిబ్బంది కథనాన్ని సిద్ధం చేసే పనిలో పడ్డారు. ‘జరిగింది ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది. మా సహచరుల మృతి గురించి చెప్పాల్సిన బాధ్యత మాది’ అని చేజ్ కుక్ అనే ఉద్యోగి ఈ విషయాన్ని ట్విటర్‌లో ధృవీకరించాడు. ఘటనను వైట్ హౌజ్ ఖండించింది. ‘‘జర్నలిస్టులు తమ బాధ్యతను తాము నిర్వహిస్తున్నారు. వారిపై దాడిచేయడమంటే ప్రతి అమెరికన్‌పైనా దాడిచేయడమే..’’ అని వైట్‌హౌస్ మీడియా సెక్రటరీ శారా సాండర్స్ వ్యాఖ్యానించారు.
ఫాక్స్‌పై ప్రజాగ్రహం... ఘటన తర్వాత ఫాక్స్ మీడియా ప్రచురించిన కథనంపై ప్రజలు మండిపడుతున్నారు. విద్వేషపూరిత కథనాల వల్లే క్యాపిటల్ గెజిట్ దాడికి గురైందని ఫాక్స్ పేర్కొంది. దీంతో పలువురు ‘మీకు సైద్ధాంతిక విలువలు లేవా?. సాటి మీడియాపై ఇలాగేనా కథనాలు ప్రచురించేది అంటూ’ సోషల్ మీడియాలో ఫాక్స్‌పై విరుచుకుపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment