క్యాస్ట్రో సిగార్ కథ
క్యాస్ట్రో పేరు చెబితే.. ఆరడుగుల నిండైన విగ్రహం. బవిరి గడ్డం.. నోట్లో పొగలుగక్కుతున్న సిగార్ గుర్తుకొస్తాయి. క్యూబా సిగార్లకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టింది కూడా ఈయనే. ఆ విషయాన్ని క్యాస్ట్రో స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. ‘‘అప్పట్లో కొహిబా (క్యాస్ట్రోకు ఇష్టమైన క్యూబన్ సిగార్)కు ఒక బ్రాండ్‌గా ఉండేది కాదు. నా బాడీగార్డ్ ఒకరు కాల్చే సిగార్ మంచి సువాసనతో ఉండేది. ఏ బ్రాండ్ తాగుతున్నావని అడిగా. ప్రత్యేకమైన బ్రాండ్ ఏదీ కాదని.. మిత్రుడు ఒకరు చుట్టి ఇస్తాడని బాడీగార్డ్ చెప్పాడు. ఆతడు ఎవరో వెంటనే పట్టుకోవాలని చెప్పా. నేనూ ఆ సిగార్‌ను కాల్చి చూశా. చాలా బాగుంది. ఆ మనిషిని వెతికిపట్టుకుని సిగార్ల తయారీ ఫ్యాక్టరీ పెట్టించాను. ఎలాంటి పొగాకు వాడాలో? ఎక్కడ్నుంచి పొగాకు సేకరించాలో అతడే చెప్పాడు. అలా కొంతమంది సిగార్ తయారీదార్లతో మొదలైంది కొహిబా’’ అంటారు క్యాస్ట్రో.
90 మీటర్ల సిగార్...
క్యాస్ట్రో 90వ జన్మదినం సందర్భంగా క్యూబన్లు ఆయనకు ఒక అపురూపమైన బహుమతి ఇచ్చారు. క్యాస్ట్రో 1980లలోనే చుట్ట కాల్చడం మానేశానని ప్రకటించినప్పటికీ.. క్యూబాకు ఓ పేరు తెచ్చిపెట్టిన సిగార్లకు ఆద్యుడిగా ఆయన్ను గుర్తు పెట్టుకునేందుకు ఏకంగా 90 మీటర్ల పొడవైన చుట్ట తయారు చేశారు. హవానా ఓడరేవు పక్కనే ఉన్న కోటలో ప్రత్యేకమైన టేబుల్‌పై పదిరోజులపాటు రోజుకు పన్నెండు గంటలపాటు కష్టపడితేగానీ ఈ భారీసైజు చుట్ట తయారు కాలేదు.