
ఆ భారీ పేలుడు ఫుటేజీ బయటకొచ్చింది
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్లోగల మన్‌హటన్ శివారులోని చెల్సియాలో ఓ చెత్తకుండీలో శక్తిమంతమైన పేలుడుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. 29మంది తీవ్రంగా గాయపడటానికి కారణమైన ఈ బాంబు స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 8.30కి జనసమ్మర్ద ప్రాంతంలో జరిగింది. దీని ధాటికి చుట్టుపక్కల భవనాల కిటికీలు, వాహనాలు దెబ్బతిన్నాయి. ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు.
అదే సమయంలో దీనికి దగ్గర్లోనే ప్రెజర్ కుక్కర్ బాంబు హడలెత్తించింది. వైర్లతో కూడిన దీన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు. ఈ పేలుడు సంభవించిన చెల్సియాలోని ఓ జిమ్ లోపలా బయట ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు అవాక్కయ్యారు. అందులో రికార్డయిన ప్రకారం జనాలంతా ఎవరి పనుల్లో వారు నిమగ్నమై వెళుతున్నారు. ఆ చోటు ప్రశాంతంగా ఉందా సమయంలో. కొంతమంది వ్యక్తులు అలా జిమ్ దాటుకుంటూ ముందుకు వెళ్లారో లేదో వెంటనే వెనుకకు పరుగులు తీశారు. భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. దీని ధాటికి ఆ జిమ్ లోని వస్తువులతోపాటు అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి. నాలుగువైపులా ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించి ఆధారాలకోసం ఆరా తీస్తున్నారు.