చెన్.. ద రియల్ హీరో!
రెండు చేతులూ లేకున్నా కావాల్సినంత ఆత్మవిశ్వాసం ఉంది.. చేతిలో డబ్బుల్లేకపోయినా గుండెనిండా బోలెడంత ధైర్యముంది. అందుకే నోరు, కాళ్లనే ఆసరాగా చేసుకుని బతుకుబండి లాగిస్తున్నాడు. అనారోగ్యంతో మంచాన పడిన 91 ఏళ్ల తల్లికి అన్నీ తానై సాకుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. చైనాకు చెందిన చెన్ జింగ్యిన్‌కు ఏడేళ్ల వయసులో జరిగిన ఓ ప్రమాదంలో రెండు చేతులూ పోయాయి. అతడికి 14 ఏళ్ల వయసు వచ్చేసరికి అక్కలిద్దరికీ పెళ్లిళ్లై వెళ్లిపోయారు.. 22 ఏళ్ల వయసులో ఉండగా అన్న, తండ్రి చనిపోయారు.. దిక్కుతోచని స్థితిలో ఉన్న చెన్‌కు భిక్షాటన చేసుకోమ్మంటూ కొంతమంది సలహా ఇచ్చారు. కానీ అది అతడికి నచ్చలేదు. తన కాళ్లపై తానే నిలబడాలి అనుకున్నాడు. దీంతో తల్లికి చేదోడువాదోడుగా ఉండేందుకు చిన్నచిన్న పనులు చేయడం నేర్చుకున్నాడు. నోరు, కాళ్లను ఆసరాగా చేసుకుని కట్టెలు కొట్టడం, పొయ్యి వెలిగించడం, వంట చేయడం వంటివి అలవాటు చేసుకున్నాడు.
ప్రస్తుతం 48 ఏళ్ల వయసున్న అతడు.. కోళ్లు, పందులు, మేకలను పెంచడంతోపాటు తమకున్న కొద్దిపాటి పొలంలో పంటలు కూడా పండిస్తున్నాడు. ఇటీవలే తల్లి అనారోగ్యంతో మంచాన పడటంతో ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఆహారం తినిపించడంతోపాటు సమయానికి మందులు కూడా వేస్తున్నాడు. చెన్ గాథ సోషల్ మీడియాలో రావడంతో అతడి వ్యక్తిత్వానికి జేజేలు కొడుతున్నారు. తల్లికి అతడు ఆహారం తినిపిస్తున్న తీరును చూసి చాలామంది చలించిపోయారు. చెన్‌కు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేకపోయారు. ప్రస్తుతం నెటిజన్లకు చెన్ ఓ హీరో..!