ఛోటారాజన్.. వచ్చేస్తున్నాడు!
బాలి: మాఫియా గ్యాంగ్‌స్టర్ ఛోటారాజన్‌తోపాటు సీబీఐ అధికారుల బృందం గురువారం సాయంత్రం బాలి విమానాశ్రయానికి చేరుకుంది. రాత్రిలోగా అతన్ని ఢిల్లీకి తరలించనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. క్విక్ రెస్పాన్స్ టీమ్‌ను రంగంలోకి దించారు. ఢిల్లీకి ఛోటారాజన్‌ను తరలించిన అనంతరం మొదట సీబీఐ అధికారులు విచారించనున్నారు. ముంబై అండర్ వరల్డ్ మాఫియా కార్యకలాపాలు, దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన సమాచారాన్ని అతని నుంచి తెలుసుకున్న తర్వాత అతన్ని ముంబై పోలీసులకు అప్పగించే అవకాశముంది.
ఇండోనేషియా రాజధాని బాలిలో అరెస్టయిన ఛోటారాజన్‌ను ఇప్పటికే భారత్‌కు తరలించాల్సి ఉంది. అయితే స్థానికంగా ఉన్న అగ్నిపర్వతం నుంచి పొగ వస్తుండటంతో రెండురోజులపాటు బాలి విమానాశ్రయాన్ని మూసివేయడంతో అతని తరలింపులో జాప్యం జరిగిన సంగతి తెలిసిందే. ఛోటారాజన్ తరలింపు విషయమై ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అతను త్వరలోనే భారత్‌లో ఉంటాడని చెప్పారు.