ఖట్మాండు : చైనా భారత్‌పై మరోసారి తన అక్కసును వెళ్లగక్కుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎవరెస్ట్ శిఖరం ఎత్తును కొలవాలన్న భారత్ ప్రయత్నానికి డ్రాగన్ కంట్రీ అడ్డుతగులుతోంది. నేపాల్‌తో కలసి సంయుక్తంగా ఎవరెస్ట్ శిఖర ఎత్తును కొలిచేందుకు భారత్ పంపిన ప్రతిపాదన తిరస్కరణకు గురైంది. దీంతో ఈ వ్యవహారం వెనుక చైనా హస్తం ఉండి ఉంటుందని భారత్ భావిస్తోంది.
ఎవరెస్ట్ ఎత్తును తామే కొలుస్తామని.. భారత్, చైనాలు కేవలం కీలకమైన గణాంకాలను అందిస్తే చాలని నేపాల్ సర్వే విభాగం డైరెక్టర్ జనరల్ గణేష్ భట్టా చెప్పారు. 2015లో 7.8 తీవ్రతతో ‘గోర్ఖా భూకంపం’ నేపాల్ ను కుదిపేసింది. ఈ విలయం తర్వాత ఎవరెస్ట్ ఎత్తు తగ్గిందనే సందేహాలు సర్వత్రా నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో నేపాల్ సర్వే డిపార్ట్ మెంట్ తో కలిసి ఎవరెస్ట్ ఎత్తును కొలిచేందుకు సర్వే ఆఫ్ ఇండియా ప్రతిపాదనలు పంపింది. కానీ, నేపాల్ మాత్రం నిర్మోహమాటంగా భారత్ ప్రతిపాదనను తిరస్కరించింది. నేపాల్‌లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంపై రాజకీయంగా ఒత్తిడి తెచ్చి చైనా ఈ పని చేయించి ఉంటుందని భారత అధికారులు అంటున్నారు.
మరి చైనా కూడా అలాంటి ప్రతిపాదనలేమైనా పంపిందా? అంటే.. అలాంటిదేం లేదని నేపాల్ స్పష్టత ఇచ్చింది. చుట్టుపక్కల దేశాల నుంచి సమాచారం తీసుకోవటం కీలకం. అందుకే భారత్, చైనా నుంచి డేటాను మాత్రం స్వీకరిస్తాం అని నేపాల్ చెబుతోంది. 1975 నుంచి 2005 దాకా ఎవరెస్ట్ ఎత్తును చైనానే నిర్థారిస్తూ వచ్చింది.
1956లో భారత్ అలాంటి ప్రయత్నం చేసింది. స్వతంత్ర భారతావనిగా ఆవిర్భవించక ముందునాటి నుంచే ఎవరెస్ట్ శిఖర విషయంలో భారత్ జోక్యం ఉండేది. సర్ జార్జ్ నేతృత్వంలోని భారత్ బృందం 1855లో ఎవరెస్ట్‌ను అత్యంత ఎత్తైన పర్వత శిఖరంగా గుర్తించింది.
Comments
Please login to add a commentAdd a comment