బీజింగ్: అంతరిక్ష రంగంలో సూపర్ శక్తిగా ఎదిగే దిశగా చైనా గొప్ప ముందడుగు వేసింది. అమెరికా, రష్యాలు కూడా ఇంత వరకు అడుగుపెట్టని, ఎవరికీ ఏమీ తెలియని చంద్రుడి వెనక భాగానికి శనివారం రోవర్‌ను ప్రయోగించింది. చాంగె–4 ప్రోబ్ మిషన్ పేరిట చేసిన ఈ ప్రయోగం విజయవంతమైందని చైనా అధికారులు ప్రకటించారు. కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి చాంగె–4 సుదూర ప్రయాణం చేసి నిర్దేశిత ప్రాంతాన్ని చేరుతుందని అంచనావేస్తున్నారు. భూమికి అభిముఖంగా ఉండే చంద్రుడి ముందటి భాగం సమతలంగా ఉంటుంది. కానీ వెనక భాగం మాత్రం పూర్తిగా కొండలు, ఎత్తుపల్లాలతో చీకటిగా ఉంటుంది.
ఈ చీకటి ప్రాంతానికి సంబంధించిన ఫొటోల్ని 1959లో సోవియెట్ యూనియన్ సంపాదించే వరకు అక్కడున్న భారీ బిలాల గురించి ఎవరికీ తెలియదు. అయితే ఇక్కడ పరిశోధన చేసేందుకు ఇంత వరకు ఏ దేశం కూడా వాహక నౌకను దించలేదు. దీంతో చైనా ప్రయోగించిన రోవరే మొదటి మిషన్‌గా గుర్తింపు పొందింది. అంతరిక్ష రంగంలో పరిశోధనకు సంబంధించి 1960, 70లలో అమెరికా, రష్యాలు సాధించిన విజయాల్ని చైనా గత 10, 20 ఏళ్లలో అధిగమించింది. అయితే ఆ దేశాలేవీ ఇంతకు ముందు చేయని కొత్త ప్రయోగాన్ని తాజాగా చైనా విజయవంతంగా చేపట్టింది. ఈ క్షణం కోసమే చైనా చాలా ఏళ్లుగా శ్రమిస్తోంది.
ఆలూ సాగుపై..
చాంగె–4 చంద్రుడిపై అడుగుపెట్టబోతున్న భాగం భూమికి చాలా దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి భూమికి నేరుగా సంకేతాలు చేరవేయడానికి సౌకర్యాలు లేకపోవడంతో పరిష్కార మార్గంగా మే నెలలో ఓ ఉపగ్రహాన్ని చంద్రుడి కక్ష్యలో ప్రవేశపెట్టారు. భూమి, రోవర్ మధ్య ఈ ఉపగ్రహం సమాచారాన్ని మార్పిడి చేస్తుంది. చంద్రుడి ఉపరితలంపై ఖనిజాల పరిశీలనకు, బంగాళాదుంపలు, ఇతర విత్తనాలు నాటేందుకున్న పరిస్థితులపై చాంగె–4 మిషన్ అధ్యయనం చేస్తుందని స్థానిక మీడియా తెలిపింది. చంద్రుడి ఉపరితలంపై దిగాక రోవర్‌కు ఎన్నో సవాళ్లు ఎదురుకానున్నాయి. ఒక ల్యూనార్ నైట్(భూమిపై 14 రోజులకు సమానం)లో ఉష్ణోగ్రతలు మైనస్ 173 డిగ్రీ సెల్సియస్‌లకు పడిపోతాయి. ఇక ల్యూనార్ డే(భూమిపై 14 రోజులు)లో 127 డిగ్రీలకు పెరుగుతాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్ని తట్టుకునే సాధనాల్నే మిషన్‌లో పంపించారు. వచ్చే ఏడాది ప్రయోగించే మరో ల్యాండర్ చాంగె–5 అక్కడి నుంచి నమూనాల్ని, చాంగె–4 అవశేషాల్ని వెనక్కి తీసుకొస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment