బీజింగ్ : మారుతున్న జీవన శైలితో చాలామంది మహిళలకు గర్భధారణ సమస్యలు ఎదురవుతున్నాయి. అలాంటి వారికి మాతృత్వపు మమకారాన్ని అందించేందుకు కృత్రిమ గర్భధారణ (ఐవీఎఫ్..ఇన్ విట్రో ఫెర్టిలిటీ) విధానం అందుబాటులోకి వచ్చింది. అయితే, చైనాలో టియాన్ (67) అనే వృద్ధురాలు మాత్రం సహజ గర్భం దాల్చి వార్తల్లో నిలిచారు. 67 ఏళ్ల వయసులో సహజ గర్భం దాల్చిన తొలి చైనా మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. ఆమె గత శుక్రవారం పడంటి బిడ్డకు జన్మనిచ్చారు. అయితే, టియాన్ దంపతులకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉండటంతో వారు విచారణ ఎదుర్కొనక తప్పేట్టు లేదు. ఎందుకంటే చైనాలో ‘ఇద్దరు పిల్లల విధానం’ అమల్లో ఉంది.
(చదవండి : 74 ఏళ్ల వయసులో మాతృత్వం.. తీవ్ర విమర్శలు)
ఇదిలాఉండగా.. 2016లో చైనా తీసుకొచ్చిన ‘ఇద్దరు పిల్లల విధానం’ సత్ఫలితాలను ఇవ్వలేదు. దశాబ్దాలుగా ‘ఒకే బిడ్డ ముద్దు.. రెండో బిడ్డ వద్దు’ విధానానికి అలవాటు పడిన అక్కడి ప్రజలు.. రెండో బిడ్డను కనేందుకు ఆసక్తి చూపడం లేదని ఓ రిపోర్టు వెల్లడించింది. చైనాలో మొదటి బిడ్డను కనే మహిళల సగటు వయసు 2016లో 24.3 సంవత్సరాలుగా ఉంటే.. అది 2019లో 26.9 కి చేరింది. చైనా తెచ్చిన ‘ఇద్దరు పిల్లల విధానం’ ఫలితంగా వృద్ధ దంపతులు రెండో సంతానాన్ని కనేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్టు తెలిసింది. ఇక 2017లో నమోదైన జననాల్లో 51 శాతం రెండో సంతానం కావడం విశేషం, 2016లో ఇది 40 శాతం మాత్రమే ఉంది.
పెద్ద వయసులో రెండో బిడ్డను కనేందుకు వృద్ధులు ఆసక్తి చూపుతున్నారనడానికి టియాన్ దంపతులే ఉదాహరణ. అయితే, టియాన్ దంపతులపై విమర్శలు వస్తున్నాయి. ముసలి వయసులో బిడ్డకు జన్మనిచ్చారని, ఇప్పుడు ఆ చిన్నారి ఆలనాపాలనా మిగిలిన వారిద్దరి పిల్లలపై పడుతుంది కదా అని విమర్శిస్తున్నారు. మరోవైపు.. మూడో బిడ్డ తమకు దేవుడిచ్చిన వరమని టియాన్ దంపతులు అంటున్నారు. ఆమెకు ‘టియాన్సి’(స్వర్గం నుంచి వచ్చిన చిన్నారి)గా నామకరణం చేశారు. టియాన్ రిటైర్డ్ డాక్టర్ కావడం గమనార్హం.
(చదవండి : తీరిన కల.. 52 ఏళ్ల వయసులో కవలలకు జననం)
Comments
Please login to add a commentAdd a comment