మోదీపై చైనా మీడియా ప్రశంసల జల్లు
బీజింగ్: ఓ పక్క సిక్కిం విషయంలో భారత్‌పై అవాకులు చెవాకులు పేలుతూ రాతలు రాస్తున్న చైనా మీడియా అనూహ్యంగా భారత ప్రధాని నరేంద్రమోదీపై ప్రశంసలు కురిపించింది. భారత్‌లో తీసుకొచ్చిన వస్తు సేవల పన్ను విధానం చరిత్రాత్మకం అంటూ కితాబునిచ్చింది. ఈ ఘనత ప్రధాని నరేంద్రమోదీకే దక్కుతుందంటూ వ్యాఖ్యానించింది. 'అతి తక్కువ ఖర్చుతో కూడిన తయారీ రంగం మెల్లగా చైనా నుంచి వెళ్లిపోతుంది. ఇప్పుడు భారత్‌కు క్లిష్టతరంగా మారనుంది. త్వరలో ప్రపంచ మార్కెట్‌లో చైనాను భారత్ భర్తీ చేయగలదు' అంటూ అక్కడి వార్తా సంస్థ గ్లోబల్ టైమ్స్ కథనాన్ని వెలువరించింది.
భారత్-చైనాకు సరిహద్దుగా ఉన్న సిక్కిం ప్రాంతం విషయంలో చైనా ప్రతి రోజు భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే కథనాలు వెలువరిస్తున్న విషయం తెలిసిందే. దాదాపుగా నెల రోజులుగా ఈ తంతు కొనసాగుతోంది. కానీ అనూహ్యంగా గ్లోబల్ టైమ్స్ ఈ కథనం వెలువరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్ మౌలిక వసతుల లేమి ఉంటుందని, విధానాల అమలులో ఆయా రాష్ట్రాల మధ్య ఇబ్బందులు ఎదురవుతుంటాయనే ఇదే భారత్‌కు కొంత వెనుకకు లాగే అంశమని కూడా గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. అయితే, ఆ సమస్యను కూడా ప్రస్తుతం భారత్ అధిగమిస్తుందని పేర్కొంటూ 'కొత్త పన్ను శకం(జీఎస్‌టీ) భారత్ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి మరింత ఊపునిస్తుంది.
ఎందుకంటే, ఆయా రాష్ట్రాల మధ్య పన్ను వైరుధ్యాలను ఈ కొత్త నిర్ణయం రూపుమాపుతుంది. కేంద్ర, రాష్ట్ర పన్నులను ఏకం చేస్తుంది. దీంతో కామన్ నేషన్ మార్కెట్ ఏర్పడుతుంది. దీంతో మౌలిక రంగంలో పోటీని కూడా అధిగమించనుంది. ప్రధాని నరేంద్రమోదీ మేక్ ఇండియా కార్యక్రమం ప్రారంభించిన 2014 సెప్టెంబర్‌నాటి నుంచి భారత్‌ను మరింత ఐక్యంగా ఉంచేందుకు శాయాశక్తులా భారత ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇది ప్రపంచ మార్కెట్‌ను ఆకర్షించేందుకు మంచి చర్య' అంటూ చైనా మీడియా వెల్లడించింది.