
క్లాడియో.. ద హీరో..
ఇదేదో గ్రాఫిక్ చిత్రం కాదు.. యోగా అంతకన్నా కాదు.. బ్రెజిల్‌లోని మాంటోశాంటోకు చెందిన క్లాడి యో ఒలివీరా(37) ఇలాగే ఉంటాడు. ఆర్థ్రోగ్రైపోసిస్ అనే అరుదైన సమస్యతో పుట్టిన క్లాడియో బతకడం అసాధ్యమని డాక్టర్లు తేల్చేశారు. కాళ్లు, చేతులు వంకర్లు పోయి.. సరిగా ఎదగక.. తల ఇలా వెనక్కి వేలాడినట్లున్న క్లాడియోను చూసిన ప్రతి ఒక్కరూ అయ్యో పాపం.. ఇంకొన్ని రోజులే అనుకున్నారు. బతికే చాన్సులూ లేనందున.. పాలివ్వడం మానేయమని అతడి తల్లి మారియా జోస్‌కు సలహా ఇచ్చినవారూ ఉన్నారు.
అయితే.. క్లాడియో అన్ని అనుమానాలనూ పటాపంచలు చేశాడు. అన్ని అడ్డంకులను జయించాడు. విజేతగా నిలబడ్డాడు. కాళ్లు లేవా.. అయితేనేం.. మోకాళ్లపై నడిచేద్దామనుకున్నాడు. చేతులు అందిరాకుంటే.. నోటితో పెన్ను పట్టాడు. తల్లిదండ్రులకు చెప్పి.. స్కూలు కెళ్లాడు. కాలేజీ మెట్లెక్కాడు. క్లాడియో ఇప్పు డో కంపెనీలో అకౌం టెంట్. పబ్లిక్ స్పీకర్ కూడా. చిన్న చిన్న సమస్యలకే చేతులెత్తేస్తున్న వారికి జీవిత పాఠాలను బోధిస్తున్నా డు. సమస్యలతో వంక రపోయిన వారి జీవితాలను సరిచేస్తున్నాడు.