
డ్రోన్ ద్వారా క్లినికల్ శాంపిల్స్ చేరవేత
న్యూయార్క్: ప్రపంచంలో దాదాపు వందకోట్ల మంది ప్రజలు ఆరోగ్య సౌకర్యాలకు దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా కొండ కోనల్లో, అటవి ప్రాంతాల్లో నివసించే గిరిజనులు సకాలంలో వైద్య సౌకర్యాలు అందక అకాల మృత్యువాత పడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాలంటే పదుల కిలోమీటర్లు కాలి నడకన వెళ్లాల్సిందే. అప్పుడప్పుడు వైద్య బృందాలు ఆయా ప్రాంతాలకు వెళ్లి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నా, వారికి సరైన ల్యాబ్ సౌకర్యాలు అందుబాటులో ఉండడం లేదు. మరి ఇలాంటి పరిస్థితులో పరిష్కార మార్గం ఏమిటీ?
దీనికి మిచిగాన్‌లోని వాయు ఏరియల్ సొల్యూషన్స్ కంపెనీ ఓ మంచి పరిష్కార మార్గాన్ని కనుగొన్నది. మారుమూల ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల్లోని ల్యాబ్‌లకు క్లినికల్ ల్యాబ్ శాంపిల్స్‌ను డ్రోన్ల ద్వారా పంపించవచ్చని ఆచరణాత్మకంగా నిరూపించింది. గత జూలై 27వ తేదీన ఆఫ్రికాలోని ఓ మారుమూల ప్రాంతంలో ప్రజల నుంచి సేకరించిన బ్లడ్ శాంపిల్స్‌ను డ్రోన్ ద్వారా సెంట్రల్ ల్యాబ్‌కు పంపించింది. ప్రపంచంలో క్లినికల్ శాంపిల్స్‌ను ఓ చోటు నుంచి మరో చోటుకు చేరవేయడానికి డ్రోన్‌ను ఉపయోగించడం ఇదే తొలిసారి. దీనికి సంబంధించిన వీడియోను వాయు ఏరియల్ సొల్యూషన్స కంపెనీ ఇప్పుడు విడుదల చేసింది.
రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ తమ కస్టమర్లకు సరకులను చేరవేయడానికి డ్రోన్లను ఉపయోగించవచ్చని ఇది వరకే చాటిచెప్పాయి. అయితే డ్రోన్లను ఉపయోగించడం వల్ల ప్రయోజనాలతోపాటు ప్రమాదాలు కూడా పొంచి ఉండడంతో వివిధ దేశాల ప్రభుత్వాలు అందుకు తగిన అనుమతులు మంజూరు చేయడం లేదు. సామాన్య ప్రజల అవసరాల కోసం డ్రోన్లను వినియోగించడాన్ని అనుమతించినట్లయితే డ్రోన్లను ఉపయోగించి టైస్టులు దాడులకు పాల్పడే ఆస్కారముందనేది ప్రభుత్వాల ఆందోళన.