ఇలా కూడా ఉండొచ్చు | Communal Living at Twin Oaks | Sakshi
Sakshi News home page

ఇలా కూడా ఉండొచ్చు

Published Sat, Aug 22 2015 6:23 AM | Last Updated on Sun, Sep 3 2017 7:56 AM

ఇలా కూడా ఉండొచ్చు

ఇలా కూడా ఉండొచ్చు

వర్జీనియా: సామూహిక సహజీవనానికి ఆ గ్రామం నిలువెత్తు నిదర్శణం. అక్కడ ఎవరికి సొంత ఇళ్లు ఉండవు. సొంత కార్లు ఉండవు. సొంత పొలాలు ఉండవు. సొంత వ్యాపారం అంటూ ఉండదు. అందరూ అన్ని పంచుకోవాల్సిందే. సమష్టిగా కలసిమెలసి పనిచేయాలి. ఫలితాన్ని సమంగా పంచుకోవాలి. పిల్లల పెంపకం కూడా సమష్టి బాధ్యతగా చూసుకుంటారు. ఎవరి వ్యక్తిగత కుటుంబం వారికున్నప్పటికీ  కమ్యూన్ ఇళ్లలోనే అందరు కలిసి మెలసి జీవిస్తారు. పరస్పరం సహాయ, సహకారాలు అందించుకున్నప్పటికీ ఎవరి ఇష్టం ప్రకారం వారు వంట చేసుకొని తింటారు. పండుగలు, పబ్బాలను మాత్రం సమష్టిగానే జరుపుకుంటారు.  ఎవరైనాఇంటర్నెట్, టీవీలు చూడవచ్చు. వీడియో గేమ్స్ ఆడకూడదు. తుపాకుల లాంటి మారణాయుధాలు కలిగివుండరాదు. బిడ్డలను కనాలంటే కమ్యూనిటి అనుమతి తప్పనిసరి.


 ఆధునిక ప్రపంచానికి దూరంగా, ఎక్కడో అటవి ప్రాంతంలో ఆదిమ తెగవాళ్లు ఇలా సామూహిక సహ జీవితాన్ని అనుభవిస్తుండవచ్చని పొరపాటు పడవచ్చు. కానీ అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం, లౌసా కౌంటీలోని ఓ గ్రామం ప్రజలు అలా జీవిస్తున్నారంటే ఆశ్చర్యం కలగవచ్చు. ఆ గ్రామం పేరు 'ట్విన్ ఓక్స్'. లౌసా కౌంటీకి సరిగ్గా ఎనిమిది మైళ్ల దూరంలో ఉంది. గ్రామం మొత్తం జనాభా 105 మంది. అందులో పెద్దవాళ్లు 92 మందికాగా, పిల్లలు 13 మంది. సరిగ్గా 48 ఏళ్ల క్రితం ఆ గ్రామం ఏర్పడింది.
 ఆ గ్రామంలో అందరు కలసి సమష్టి వ్యవసాయం చేస్తారు. గ్రామానికి అవసరమైన మేరకు ధాన్యాలను భద్రపర్చుకొని మిగతావి సమీపంలోని మార్కెట్‌లో విక్ర యిస్తారు. ఆవులను పోషిస్తూ పాలను విక్రయిస్తారు. అలా వచ్చిన సొమ్ము కమ్యూనిటీ ఖాతాలోకి వెళుతుంది. గ్రామంలోని పాఠశాలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. యాభై ఏళ్లలోపున్న ప్రతి ఒక్కరు వారానికి 48 గంటలు కమ్యూన్ వ్యవసాయంలో పనిచేయాలి. యాభై ఏళ్ల పైబడిన వారు రోజుకు గంట చొప్పున కమ్యూనిటీ గార్డెనింగ్ లాంటివి చూసుకోవాలి. పిల్లల పోషణ సమష్టి బాధ్యత.


 ఒక్కో కమ్యూనిటీ ఇంట్లో దాదాపు 20 మంది నివసిస్తారు. గ్రామస్థులు జీవితంలో ఒక్కరినే పెళ్లి చేసుకుంటారు. వారిలో ఇప్పటి వరకు విడాకులంటూ లేవు. సంతానానికి వారిస్తున్న ప్రాధాన్యత తక్కువ. కమ్యూనిటీ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి కావడం అందుకు కారణం కావచ్చు. కమ్యూనిటీలో పనిచేసే ప్రతి వ్యక్తికి ఆడ, మగ తేడా లేకుండా నెలకు దాదాపు ఆరువేల రూపాయలను జీవన భృతిగా చెల్లిస్తారు.


 సరైన ఉద్యోగంలేక దారిద్య్రంలో బతుకుతున్న వారంతా కలసి 48 ఏళ్ల క్రితం ఆ గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారట. అప్పటి నుంచే ఈ కమ్యూనిటీ జీవితాన్ని ప్రారంభించారట. ఇప్పుడు వారికి దారిద్య్రం అంటే తెలియదు. అలాగని ధనవంతులయ్యే అవకాశం లేదు. తామంతా కమ్యూనిటీ జీవితాన్ని గడుపుతుండడం వల్ల తమకు డబ్బనేది అర్థంలేని విషయంగానే కనిపిస్తుందని చెబుతున్నారు. ఈ సమష్టి సహ జీవనం తమకు ఎంతో ఆనందంగా ఉందని, తమ మధ్యనే ప్రేమలు, పెళ్లిల్లూ జరుగుతుండడం వల్ల బయటి ప్రపంచంతో తాము పెద్దగా సంబంధాలు కూడా కోరుకోవడం లేదని వారు తెలియజేస్తున్నారు.


 మొన్నటి వరకు ఓ కార్పొరేట్ కంపెనీలో సీఈవోగా పనిచేసిన మహిళ తన మాజీ భర్త, సాపో అనే తన ఎనిమిదేళ్ల పాపతో వచ్చి కొత్తగా వారి కమ్యూనిటీలో చేరింది. తనకు వారి కమ్యూనిటీ జీవితం ఎంతో నచ్చిందని, ఎంతోకాలం నిరీక్షణ తర్వాత తనకు కమ్యూనిటీలో చేరే అవకాశం చిక్కిందని ఆమె మీడియాకు తెలియజేశారు. కమ్యూనిటీలో చేరేందుకు ఇంకా చాలా మంది నిరీక్షణ జాబితాలో ఉన్నారట. ఈ కమ్యూనిటీ జీవితం పట్ల మొఖం చిట్లిస్తున్న వారూ లేకపోలేదు.


 'నాతోటి పిల్లలు లేకపోవడం వల్ల నాకు ఇక్కడ బోర్ కొడుతోంది. ఎంతసేపు ఈ పొలాల మధ్య బతుకుతాను. బయటకెళ్లి పబ్లిక్ స్కూల్లో చేరాలనుకుంటున్నాను. అందుకు కమ్యూనిటీ అనుమతి కూడా తీసుకున్నాను' అని 22 ఏళ్ల ఇమాని కాలెన్ వ్యాఖ్యానించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement