
న్యూయార్క్ : కరోనా మహమ్మారి దెబ్బకు అమెరికా అల్లాడిపోతోంది. ప్రపంచంలోనే అధికంగా అమెరికాలో 10 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదు కాగా.. దాదాపు 56 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్‌పై కరోనా ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. ఇక్కడ దాదాపు 3 లక్షల కరోనా కేసులు నమోదు కావడంతోపాటు దాదాపు 22వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇంతకు మందు ప్రకటించిన లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశం ఉన్నట్టు న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ కువోమో సూచనప్రాయంగా తెలిపారు. కాగా, ఇప్పటికే మే 15 వరకు లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే న్యూయార్క్ రాష్ట్రంలో కరోనా ప్రభావం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొన్ని సడలింపులు ఉండనున్నాయని, అదే క్రమంలో తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం షట్‌డౌన్ పొడగించనున్నట్టు తెలిపారు.
ఇదిలా ఉండగా.. కరోనా కారణంగా ఆర్థిక రంగం, లక్షలాది మంది ప్రజలు తీవ్రంగా నష్టపోతుండటంతో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. దశల వారీగా రాష్ట్రంలోని వివిధ రంగాలను తిరిగి తెరిచేందుకు ప్రణాళికలను సిద్దం చేసింది. ఇందులో భాగంగా మొదటి దశలో వైరస్ ఇన్‌ఫెక్షన్ ప్రభావం తక్కువగా ఉండే కన్‌స్ట్రక్షన్, మ్యాన్యుఫాక్చరింగ్ రంగాలను తెరవనుంది. మొదటి దశ అమలు చేశాక వైరస్ వ్యాప్తి, ప్రమాద స్థాయిని పరిగణనలోకి తీసుకుని రెండో దశలో మరికొన్ని పరిశ్రమలను తెరవనున్నట్టు ఆండ్రూ క్యూమో తెలిపారు. ఏ రంగాలు అత్యవసరమో.. ఏ రంగాల వల్ల కరోనా ఎక్కువగా వ్యాప్తి చెందదో చూసి ఆయా రంగాలను రెండో దశలో తెరవనున్నట్టు చెప్పారు. మొదటి దశను అమలు చేసిన రెండు వారాల తరువాత రెండో దశను అమలు చేయనున్నట్టు ఆండ్రూ క్యూమో పేర్కొన్నారు. ఈ రెండు వారాల సమయంలో వివిధ రంగాలను తెరవడం వల్ల వైరస్ వ్యాప్తి ఎలా ఉందనేది పరిశీలిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment