
లండన్ : కరోనా వైరస్ సోకిన బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్(55)ను ఆదివారం ఆసుపత్రికి తరలించారు. గత ఏడు రోజులుగా ఆయన క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నప్పటికీ.. ఇంకా కొన్ని వైరస్ లక్షణాలు ఉన్నాయని అందుకే ఆయనను ఆస్పత్రికి తరలించామని అధికారులు వెల్లడించారు. స్వీయ నిర్భందంలో ఉన్న బోరిస్ గత శుక్రవారమే బయటకు రావాల్సింది. కానీ తీవ్రమైన జ్వరం ఉండడంతో ఆదివారం వరకు క్వారంటైన్‌లో ఉన్నారు. కోవిడ్ లక్షణాలు తగ్గకపోవడంతో.. ముందుజాగ్రత్త చర్యగా అతన్ని ఆసుపత్రికి తరలించామని డౌనింగ్ స్ట్రీట్ అధికారులు చెప్పారు. బోరిస్ ఆరోగ్య పరిస్థితి నిలకడ ఉందని స్పష్టం చేశారు.
తాను ఆరోగ్యంగానే ఉన్నాని, కొన్ని కరోనా లక్షణాలు ఉండడంతో ఆస్పత్రిలో చేరానని బోరిస్ ఓ వీడియో ద్వారా తెలియజేశారు. కరోనా లక్షణాలు పూర్తిగా తగ్గేవరకు స్వీయ నిర్బంధంలోనే ఉండి పని చేస్తానని స్పష్టం చేశారు. గత పదిరోజులుగా ప్రధాని బోరిస్ ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండి కరోనా వ్యాప్తిపై సమీక్షిస్తూ వీడియో మెసేజ్ లు విడుదల చేశారు. కాగా, బ్రిటన్‌లో 47,806 మందికి కరోనా వైరస్ సోకగా, 4,934 మంది మరణించారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 13 లక్షల మందికి కరోనా సోకింది. 69,459 మంది మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment