రోమ్ : కరోనా వైరస్ ధాటికి ఇటలీ చిగురుటాకులా వణుకుతోంది. వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా ఇప్పటికే 3,405 మంది మృతి చెందగా.. 41,035 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో కరోనా మృతులు అత్యధికంగా నమోదైన దేశంగా ఇటలీ తొలిస్థానంలో నిలవగా.. చైనాలో 3242 మంది వైరస్ కారణంగా కన్నుమూశారు. మరోవైపు శుక్రవారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా వైరస్ మృతుల సంఖ్య పదివేలకు చేరింది. ఇక కోవిడ్‌తో ఇటలీలోని ప్రముఖ నగరాల్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఏ ఒక్కరూ బహిరంగ ప్రదేశాలకు రావడంలేదు. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జనాలు బయటకురావడానికి జంకుతున్నారు. గత ఇరవై రోజులుగా దేశ వ్యాప్తంగా అన్ని కార్యాలయాలు, మాల్స్, విద్యాసంస్థలు మూసివేయడంతో ఇటలీ వీధుల్లో పూర్తిగా కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. (కరోనా మరణాల్లో చైనాను మించిన ఇటలీ)
నిత్యావసరాలు దొరికే సూపర్ మార్కెట్లు, ఫార్మసీలు తప్ప మిగతావన్నీ మూసేశారు. తమకు కావల్సిన సరుకులు తెచ్చుకోవాలంటే ఇంట్లో నుంచి ఒక్కరికి మాత్రమే బయటకు రావడానికి అనుమతిస్తున్నారు. సూపర్ మార్కెట్లు, ఫార్మసీల కిటికీలు మాత్రమే తెరిచి ఉంచుతారు. ఒకరి తర్వాత ఒకరు క్యూ పద్ధతి పాటిస్తూ లోపలికి వెళ్లి వారికి కావల్సినవి తెచ్చుకోవాలి. రద్దీ ఎక్కువ ఉంటే ఒకసారి నలుగురైదుగురిని లోపలికి అనుమతిస్తారు కానీ ఒక్కొక్కరి మధ్య కనీసం మూడు అడుగుల దూరం పాటించాలి. ఇల్లు కదిలి బయటకి రావాలంటే పోలీసులకు కారణాలు చెప్పాలి. ఇలా అడుగడుగునా ఆంక్షలు విధించారు. దీంతో ఎప్పుడూ జనసంద్రోహంతో కిటకిటలాడే పర్యటక ప్రాంతాలు సైతం వెలవెలబోతున్నాయి. మరో రెండు వారాల పాటు ఇటలీలో ఇవే పరిస్థితులు కొనసాగనున్నాయి. ఓ మేరకు సోషల్ మీడియాలో ఇటలీకి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment