రోమ్ : ప్రపంచ దేశాలపై ప్రమాదకర కరోనా వైరస్ (కోవిడ్-19) కోరలు చాస్తోంది. వైరస్ బారిన పడిన మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం నాటికి వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య పదివేలు దాటగా ఆ సంఖ్య శనివారం ఉదయానికి 11,310కు చేరింది. ఇక 2,72,351 మందికి ఈ వైరస్ సోకినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కోవిడ్ ధాటికి చిగురుటాకులా వణుకుతున్న ఇటలీలో మృతుల సంఖ్య నాలుగువేలకు దాటింది. గడిచిన 24 గంటల్లో ఆ దేశంలో 627 మంది కన్నుమూసినట్లు ఇటలీ ఆరోగ్యశాఖ అధికారులు ధృవీకరించారు. అలాగే, కేసుల సంఖ్య 47 వేలు దాటింది. ఇరాన్‌లో మృతుల సంఖ్య 1433కి చేరింది. అమెరికాలోనూ కోవిడ్ మృతుల సంఖ్య 200 దాటిపోయింది. (కరోనా ఎఫెక్ట్ : సిలికాన్ వ్యాలీ షట్‌డౌన్)
భారత్‌లో బాధితులు 200పైనే
దేశంలోనూ కరోనా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఒక్క రోజులోనే అత్యధికంగా 50 కొత్త కేసులు నమోదు కావడంతో శుక్రవారం నాటికి దేశం మొత్తమ్మీద కరోనా వైరస్ బాధితుల సంఖ్య 223కు చేరుకుంది. వైరస్ కట్టడికి రాష్ట్రాలు పలు చర్యలు చేపట్టాయి. ముంబై, పుణే, నాగపూర్‌లలో కార్యాలయాలన్నింటినీ మార్చి 31వ తేదీ వరకూ మూసివేస్తున్నట్లు ముఖ్యమంతి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించగా, కిరాణా, మందుల దుకాణాలను మినహాయించి అన్ని మాల్స్‌ను మూసివేస్తున్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ప్రధాని మోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపునకు స్పందనగా రైల్వే శాఖ శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి 10 గంటల వరకూ రైళ్లన్నింటినీ నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. దేశంలో కరోనా వైరస్ బారిన పడ్డవారిలో 32 మంది విదేశీయులు ఉన్నారు. (ఎమ్మెల్యే కోనప్పను క్వారంటైన్‌లో ఉంచండి)
దేశం మొత్తమ్మీద ఇప్పటివరకూ ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్, ముంబైలలో ఒకొక్కరు చొప్పున నలుగురు కోవిడ్ కారణంగా మరణించిన విషయం తెలిసిందే. కాగా రాజస్తాన్‌లో చికిత్సతో స్వస్థత చేకూరిన ఒక ఇటాలియన్ పర్యాటకుడు గుండెపోటుతో గురువారం రాత్రి మరణించినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలో మొత్తం 17 కేసులు నమోదు కాగా, వీరిలో ఒక విదేశీయుడు ఉన్నాడు. ఉత్తర ప్రదేశ్‌లో ఒక విదేశీయుడితో కలిపి మొత్తం కేసులు 19 నమోదయ్యాయి. మహారాష్ట్రలో ముగ్గురు విదేశీయులతో కలిపి 47 కేసులు నమోదు కాగా, కేరళలో ఇద్దరు విదేశీయులతో కలిపి 28 పాజిటివ్ కేసులు ఉన్నాయి. (ఇండోనేషియా బృందాల పర్యటనపై ఆరా!)
కర్ణాటకలో 15, లడాఖ్‌లో 10, జమ్మూ కశ్మీర్‌లో నాలుగు, తెలంగాణలో 9 మంది విదేశీయులతో కలిపి 16 కేసులు ఉన్నాయని ఆరోగ్య శాఖ వివరించింది. రాజస్తాన్‌లో ఇద్దరు విదేశీయులతో కలిపి 9 మంది, తమిళనాడులో ముగ్గురు, ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు వ్యాధి బారిన పడినట్లు తెలిపింది. ఇక, హరియాణాలో 17 మంది కోవిడ్ బారిన పడగా వీరిలో 14 మంది విదేశీయులు. ఒడిశాలో రెండు, ఉత్తరాఖండ్‌లో మూడు, బెంగాల్, పంజాబ్‌లలో రెండు చొప్పున, పుదుచ్చేరి, చండీగఢ్‌లలో ఒక్కో కేసు నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment