
వీరి సంఖ్యను చేర్చడం వల్ల మృతుల సంఖ్య పెరిగిపోయి ప్రజలు భయాందోళనలకు గురవుతారన్న ఆందోళన కారణమా?
వాషింగ్టన్ : అమెరికాలో నర్సింగ్ లేదా కేర్ సెంటర్‌లుగా వ్యవహరించే వృద్ధాశ్రమాల్లో కరోనా బారిన పడి ఇప్పటి వరకు 3,621 మంది మరణించారు. అమెరికా ప్రధాన కరోనా మృతుల జాబితాలో వీరీని చేర్చలేదు. అధికారికంగా మృతుల సంఖ్యను ఈ సెంటర్లు ప్రకటించక పోవడమే ఇందుకు కారణమట. ఇదే విషయాన్ని కేర్ సెంటర్ల నిర్వాహకులను ప్రశ్నించగా అమెరికా ఫెడరల్ ప్రభుత్వం అధికారికంగా కరోనా మృతుల సంఖ్యను ప్రకటించలేనందున తాము ప్రకటించలేదంటూ సమాధానం వచ్చింది. వృద్ధుల పునరావాసం కోసం లేదా వివిధ అనారోగ్య కారణాలతో బాధ పడుతున్న వారిని ఈ సెంటర్లలో చేర్చుకుంటారు.
అమెరికా ఆస్పత్రి వర్గాల సమాచారం మేరకు అక్కడ ఇప్పటి వరకు 21 వేల మందిపైగా మృత్యువు బారిన పడ్డారు. వృద్ధాశ్రమాల మరణాలను కూడా పరిగణలోకి తీసుకున్నట్లయితే అమెరికాలో ఇప్పటి వరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశముంది. రిచ్‌మండ్, వర్జీనియా కేర్ సెంటర్లలో 42 మంది మరణించగా, ఇండియాన నర్సింగ్ హోంలో 24 మంది, మసాచుసెట్స్‌లోని హోలియోక్ పింఛనుదారుల ఆశ్రమంలో 38 మంది మరణించారు. ఈ సెంటర్లలో గత పది రోజుల్లోనే 450 మంది మరణించారు. ఈ సెంటర్లలో కొన్ని వందల మంది కరోనా బారిన పడ్డారని తెలుస్తోంది. ఈ సెంటర్లలో నివసిస్తున్న వారు వృద్ధులు లేదా అనారోగ్యంతో బాధ పడుతున్న వారవడం వల్ల ఈ సెంటర్ల మృతుల సంఖ్యను పరిగణలోకి తీసుకోలేదా? లేదా వీరి సంఖ్యను చేర్చడం వల్ల మృతుల సంఖ్య పెరిగిపోయి ప్రజలు భయాందోళనలకు గురవుతారన్న ఆందోళన కారణమా? స్పష్టం కావడం లేదు.