సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలో కరోనా వైరస్ బారిన పడి కనీసం లక్ష మంది మరణిస్తారంటూ తాను ఇదివరకే చేసిన ప్రకటనకు తాను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని, ఏప్రిల్ చివరి నాటికి ఈ మృతుల సంఖ్య రెండు లక్షల వరకు పెరిగే అవకాశం ఉందని ప్రముఖ ప్రభుత్వ అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ ఆంథోనీ ఫాసీ ఆదివారం సాయంత్రం వైట్‌హౌజ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హెచ్చరించారు. అది జరగుకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. సామాజిక దూరాన్ని పాటించాలంటూ ప్రజా కదలికలపై విధించిన ఆంక్షలను ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగించడం మంచిదని ఆయన చెప్పారు.
(చదవండి : తీవ్ర ఒత్తిడిలో ఆమెరికా వైద్య సిబ్బంది)
డాక్టర్ ఆంథోనీ మాట్లాడిన అనంతరం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, దేశంలో కరోనా మృతుల సంఖ్య రోజుకు వెయ్యి నుంచి రెండువేలకు చేరుకున్నా, మృతుల సంఖ్య రెండు లక్షలకు చేరుకున్నా కరోనా నివారణకు తాము తీసుకుంటోన్న చర్యలు విజయం అయినట్టేనని అన్నారు. కరోన వైరస్ ఆంక్షలను 15 రోజుల్లోనే ఎత్తివేయాలంటూ తొలుత మాట్లాడిన ట్రంప్ ఇప్పుడు మనసు మార్చుకున్నారు. కరోనా వైరస్ నియంత్రణా చర్యల కోసం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ 15 రోజుల ప్రణాళికను ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ట్రంప్ యంత్రాంగం తెలిపింది.
ఆదివారం నాటికి అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 1,32,647కు చేరుకోగా, మృతుల సంఖ్య 2,355కు చేరుకుంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోయినట్లయితే మృతుల సంఖ్య రెండు లక్షలకు చేరుకోవచ్చన్నది డాక్టర్ ఆంథోని అంచనా కాగా, మృతుల సంఖ్యను రెండు లక్షలకు మించకుండా ఉన్నా, కరోనా వైరస్ నిరోధానికి తాము తీసుకుంటోన్న చర్యలు విజయవంతమైనట్లేనని ట్రంప్ అభిప్రాయం.
Comments
Please login to add a commentAdd a comment