ఇస్లామాబాద్ : చైనాలో పుట్టిన మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచదేశాలకు పాకింది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వేల మంది మృత్యువాతపడ్డారు. కరోనాపై పోరాటం చేస్తున్న డాక్టర్లు, సైంటిస్టులనే దేవుళ్లుగా అందరూ భావిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో వైద్యసిబ్బందికి అవసరమైన పరికరాలను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల కనీస ధర్మం. అయితే వారికి అవసరమైన సామాగ్రిని అందించకపోగా, నిరసన తెలిపిన డాక్టర్లు, వైద్యసిబ్బందిపై లాఠీఛార్జ్ చేసి అరెస్ట్ చేసింది పాకిస్తాన్‌లోని బలుచిస్తాన్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో కరోనా విధులు నిర్వర్తిస్తున్న 53 మంది డాక్టర్లు, వైద్యసిబ్బందిని అరెస్ట్ చేసినట్లు క్వెట్టా పట్టణ పోలీస్ సీనియర్ అధికారి అబ్దుల్ రజాక్ మీడియాకు తెలిపారు.
ఇంతకీ ఏం జరిగిందంటే??
‘కరోనా వార్డులకు వెళ్లి రోగులకు చికిత్స చేసే డాక్టర్లకు, ఇతర వైద్యసిబ్బందికి అవసరమైన వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ) కిట్ల కొరత ఉంది. మాస్కులు, గ్లౌజులు, చేతి తొడుగులు, పూర్థిస్థాయి గౌనులు అందుబాటులో లేవు. పీపీఈ కిట్లను అందించాలని గత కొన్ని వారాలుగా ప్రభుత్నాన్ని కోరుతున్నాం. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో ఆస్పత్రి ముందు నిరసన తెలిపాం. అంతేకాకుండా మేమేందరం(డాక్టర్లు, వైద్య సిబ్బంది) సీఎం ఇంటికి వెళ్లి ఇదే విషయాన్ని గట్టిగా చెప్పాలనుకున్నాం. కానీ పోలీసులు మమ్మల్ని అడ్డుకొని లాఠీఛార్జ్ చేసి అరెస్ట్ చేశారు’అని క్వెట్టా పట్టణ డాక్టర్ల సమాఖ్య అధ్యక్షుడు యాసీర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం చెప్పింది ఏంటంటే?
అయితే డాక్టర్లు, వైద్యసిబ్బంది అరెస్ట్‌పై బలుచిస్తాన్ ప్రభుత్వం స్పందించింది. ‘పీపీఈ కిట్ల కొరత ఉన్నది నిజమేనని అంగీకరిస్తున్నాం. అయితే కిట్ల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కానీ డాక్టర్లు, వైద్యసిబ్బంది ఓపిక పట్టకుండా నిరసన చేపట్టారు. 144 సెక్షన్‌ను ఉల్లంఘించారు. అందుకే ఆరెస్ట్ చేశాం’అని బులచిస్తాన్ ప్రభుత్వం పేర్కొంది. ఇక డాక్టర్లపై లాఠీచార్జ్, అరెస్ట్ చేయడంపై అన్ని వైపుల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి కష్ట సమయంలో డాక్టర్లను కాపాడుకోవాల్సింది పోయి ఆరెస్ట్ చేయడం దారుణమని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, పాకిస్తాన్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,469కి చేరింది. బలుచిస్తాన్‌లో 192 కేసులు నమోదు అయ్యాయి. పాక్‌లో ఇప్పటి వరకు 50 మంది ప్రాణాలు కోల్పోయారని గణాంకాలు వెల్లడించాయి.
చదవండి:
పాత మందుతో 48 గంటల్లో వైరస్‌కు చెక్?
అమెరికాలో మరింత తీవ్రం!
Comments
Please login to add a commentAdd a comment