సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అమెరికాలోని భారత జాతీయులు కరోనాతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటి నుంచి కాలు బయట పెట్టేందుకు జంకుతున్నారు. విధిలేని పరిస్థితిలో నిత్యావసర వస్తువులకు బయటకు వెళ్లిన ప్రతి ఇద్దరిలో ఒకరు కరోనా బారిన పడుతున్నారు. కచ్చితమైన లెక్కలు లేకపోయినా దాదాపు 100 మంది దాకా భారత జాతీయులు ఈ వ్యాధి బారిన పడి మరణించి ఉంటారని అమెరికాలో భారత సంఘాలు చెబుతున్నాయి. న్యూయార్క్‌లో స్థిరపడి ఆ దేశ పౌరసత్వం తీసుకున్న వారే అందులో ఎక్కువగా ఉన్నారని, న్యూజెర్సీకి చెందిన ఓ పాతిక మంది దాకా ప్రాణాలు విడిచారని తెలుస్తోంది. అమెరికాలో సీనియర్ జర్నలిస్టుగా పని చేస్తున్న బ్రహ్మ కూచిబొట్ల రెండు రోజుల క్రితం న్యూయార్క్ ఆస్పత్రిలో చనిపోయారు. అమెరికాలో భారత రాయబార కార్యాలయం అక్కడి భారతీయులు ఎదుర్కొం టున్న సమస్యలపై కనీస శ్రద్ధ పెట్టడం లేదని భారతీయులు వాపోతున్నారు. న్యూజెర్సీలో ఓ కుటుంబానికి చెందిన (కర్ణాటక) తండ్రి, కొడుకు కరోనా బారిన పడి చనిపోవడంతో ఇంట్లో ఉన్న అత్తా కోడలు దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారు. కరోనా భయంతో వారిని పరామర్శిం చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం అక్కడి భయానక పరిస్థితికి అద్దం పడుతోంది.
వారం సరుకులు నెల వరకూ..
న్యూజెర్సీలో భారతీయులు, మరీ ముఖ్యంగా తెలుగు ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి. వారం రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను నెల రోజులు వాడకునేందుకు వీలుగా పొదుపు చేసుకుంటున్నారు. వేర్వేరు రాష్ట్రాల్లో ఉంటున్న తెలుగు వారు కమ్యూనిటీలుగా ఏర్పడి వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని క్షేమ సమాచారాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ‘రోజూ నలుగురో ఐదుగురో కరోనా బారిన పడుతున్నారు. వారికి సహాయం చేసే స్థితిలో లేకపోవడం మాకు శోకాన్నే మిగులుస్తోంది. పిల్లలు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యాధిని నియంత్రించడానికి అమెరికా తీసుకుంటున్న చర్యలు శూన్యం. ఈ దేశానికి ఎందుకు వచ్చాం దేవుడా అని రోజుకు పది సార్లు అనుకోవాల్సి వస్తోంది’అని న్యూజెర్సీలో నివాసం ఉంటున్న కంచరకుంట్ల సుధీర్‌రెడ్డి ‘సాక్షి’ప్రతినిధితో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. న్యూజెర్సీలోని హడ్సన్ కౌంటీలో దాదాపు 50 వేల మంది భారతీయులు ఉండగా వారిలోనూ 25 నుంచి 30 వేల మంది తెలుగు వారేనని సుధీర్ అన్నారు.
ఏఏపీఐ మాజీ అధ్యక్షుడు సైతం..
అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆర్జిన్ (ఏఏపీఐ) మాజీ అధ్యక్షుడు ఇప్పుడు కరోనా బారిన పడి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నారు. నిత్యావసర వస్తువుల కోసం బయటకు వెళ్లిన ప్రతి ఇద్దరిలో ఒక్కరు కరోనా పాజిటివ్‌తో బాధపడుతున్నారు. ‘గత శుక్రవారం నేనూ, మా కమ్యూనిటీలోఉండే మరో నలుగురం వేర్వేరు కార్లలో కాస్ట్‌కోకు వెళ్లాం. అక్కడి నుంచే మరో ఇండియన్ స్టోర్‌కు కూడా వెళ్లాం. మేమంతా ఇప్పుడు కరోనా లక్షణాలతో బాధపడుతున్నాం. మా ఐదుగురిలో ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. మిగిలిన ఇద్దరం ఇప్పుడు క్వారం టైన్‌లో ఉన్నాము’ అని విశాఖపట్టణానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.
టెక్సాస్, కాలిఫోర్నియా, ఆరిజోనా రాష్ట్రాల్లోనూ..
భారతీయులు ఎక్కువగా నివ సించే టెక్సాస్, కాలిఫోర్నియా, ఆరిజోనా రాష్ట్రాల్లోనూ వేగంగా కేసులు పెరుగుతున్నాయి. ‘మా కళ్ల ముందే అనేక మంది కరోనా బారిన పడుతున్నారు. ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాము’అని రాజేంద్ర డిచ్‌పల్లి అన్నారు. భారతీయ సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రేటర్ వాషింగ్టన్, న్యూయార్క్ మెట్రోపాలిటన్, మేరీల్యాండ్‌కు చెందిన అనేక మంది కమ్యూనిటీ లీడర్లు కరోనా బారినపడ్డారు. వీరిలో మెజారిటీ వారి ఇళ్లలోనే సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నారు. హూస్టన్‌కు చెందిన భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రోహన్ బవదేకర్ మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. ఆయన చికిత్స కోసం స్నేహితులు 2.04 లక్షల డాలర్లను సేకరించారు. మియామీలోని కార్డియాక్ ప్రివెంటివ్ కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ముకుల్ ఎస్.చంద్ర వెంటిలేటర్ సాయంతో చికిత్స పొందుతున్నారు. ఆయన మృత్యువు నుంచి బయటపడేందుకు ప్లాస్మా దోనర్ కోసం వాట్సాప్ గ్రూపుల్లో వినతులు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment