న్యూయార్క్ : రాబోయే రోజుల్లో ఎన్నో సంక్షోభాలను ఎదుర్కోబోతున్నామని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ హెచ్చరించారు. రెండో ప్రపంచ యుద్దం తరువాత ఇలాంటి పరిస్థితిని ప్రపంచం ఎప్పుడు చూసి ఉండదని అంచనా వేశారు. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనావైరస్ మహమ్మారి ప్రభావం ఆర్ధిక రంగంపై అత్యధికంగా ఉందని, కనీవినీ ఎరుగని ఆర్ధికమాంద్యాన్ని ప్రపంచం చూడబోతుందన్నారు. ఈ స్ధాయి ఆర్ధిక మాంద్యాన్ని ఎప్పుడు చూసి ఉండరని అంచనా వేశారు. కరోనా వైరస్ ప్రభావం అత్యంత అస్థిరత, ఆశాంతి, ఆందోళనలకు దారితీయబోతుందని చెప్పారు.
సామాజికార్ధిక పరిస్థితులపై కరోనావైరస్ ప్రభావంపై నివేదిక విడుదల చేసే సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ప్రపంచదేశాలు కలిసికట్టుగా కరోనా వైరస్‌పై పోరాటం చేయాల్సిన సమయమని అన్నారు. రాజకీయ విషయాలు పక్కన పెట్టిన మానవాళిని రక్షించుకోవడానికి అన్ని దేశాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్య సమితి చరిత్రలో ఈ స్ధాయి ఆరోగ్య సంక్షోభాన్ని ఎప్పుడూ చూడలేదని నివేదికలో అభిప్రాయపడ్డారు. ఇది కేవలం ఆరోగ్యరంగాకే పరిమితం కాకుండా అన్ని రంగాలపై ప్రభావం చూపుతూ మానవ సంక్షోభానికి దారి తీస్తుందని పేర్కొన్నారు. (కరోనా షాక్ : భారత్, చైనాకు మినహాయింపు)
కరోనాను ఎదుర్కోవడానికి ఎవరికి వారు సొంత ఎజెండాలతో ముందుకు సాగుతున్నారని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను ఖాతరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్య రంగంలో మౌలిక వసతులు లేని దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలు అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అందరి సహకారంతోనే కరోనా మహమ్మారిని తరిమి కొట్టగలమని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment