యుద్ధానికి కౌంట్‌డౌన్ మొదలైంది: చైనా
బీజింగ్: భారత్‌తో యుద్ధానికి కౌంట్‌డౌన్ మొదలైందని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. యుద్ధం వద్దు అనుకుంటే భారతే డొక్లాంలో సైన్యాన్ని వెనక్కుపిలవాలని సూచించింది. ఆలస్యమైన తర్వాత సైన్యాన్ని వెనక్కు పిలిచినా ప్రయోజనం ఉండబోదని బుధవారం హెచ్చరించింది.
తన ఎడిటోరియల్ కాలమ్‌లో భారత్‌పై తీవ్రంగా విరుచుకుపడిన గ్లోబల్ టైమ్స్.. సమయం మించిపోతోందని, ఇకనైనా భారత్ ఊహల్లోంచి బయటకొచ్చి ప్రత్యక్ష ప్రపంచాన్ని కళ్లు తెరచి చూడాలని వ్యాఖ్యానించింది. ముందుగానే సైన్యాన్ని డొక్లాం నుంచి ఎందుకు ఉపసంహరించుకోలేదా అని భారత్ బాధపడాల్సివస్తుందని చేతికొచ్చినట్లు రాతలు రాసింది.
ఇప్పటికే ఏడు వారాలు గడిపోయాయని చెప్పుకొచ్చిన గ్లోబల్ టైమ్స్.. సమయం గడిచేకొద్దీ శాంతి బాట మూసుకుపోతుందని తెలిపింది. పదేపదే పత్రికలో వస్తున్న హెచ్చరికలను భారత్ పెడచెవిన పెడుతోందని.. కళ్లు, చెవులు ఉన్న వారికి తామిచ్చే సమాచారం చేరుతుందని వ్యాఖ్యానించింది.