ప్రతీకాత్మక చిత్రం
వుహాన్: ప్రపంచ వ్యాప్తంగా 95కి పైగా దేశాలకు విస్తరించిన కరోనా (కోవిడ్-19) వైరస్ చైనాలో తగ్గుముఖం పడుతున్నట్టుగా తెలుస్తోంది. భారీ స్థాయిలో కల్పించిన వైద్య సదుపాయాలతో చైనాలో వైరస్ వ్యాప్తి తగ్గగా.. ఇతర దేశాల్లో మాత్రం దాని వేగం అంతకంతకూ పెరుగుతోంది. ఇక తాజాగా వెలుగుచూసిన ఓ వార్త చైనాలో వైరస్ వ్యాప్తి తగ్గుతోందనడానికి సాక్ష్యంగా నిలిచింది. ప్రాణాంతక వైరస్ బారిన పడిన 100 ఏళ్ల వృద్ధుడు ఒకరు కోలుకున్నారు. గత ఫిబ్రవరి 24న ఆస్పత్రిలో చేరిన ఆయన 13 రోజులపాటు చికిత్స పొంది వైరస్‌ను జయించారని హుబే ప్రావిన్స్ వైద్యులు తెలిపారు. వైరస్‌ను జయించిన పెద్ద వయస్కుడిగా కూడా ఆయన రికార్డు సాధించారని పేర్కొన్నారు. బీపీ, అల్జీమర్స్, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆ పెద్దాయన కోలుకోవడం శుభసూచకమన్నారు. కాగా, చైనాలో ఇప్పటివరకు 80 వేల మంది వైరస్ బారిన పడగా.. 3 వేలకు పైగా ప్రాణాలు కోల్పోయారు.
(చదవండి: ‘ఆ రెండు జన్యుక్రమాలు సరిపోలాయి’)
భారత్‌లో కరోనా@43
ఇక చైనా ఆవల దేశాల్లో కరోనా దూకుడు తగ్గడం లేదు. ప్రధానంగా ఇటలీ, ఇరాన్ దేశాలు కోవిడ్ ధాటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇరాన్‌లో 49 మంది మృతి చెందినట్లు ఆ దేశ అధికారులు ఆదివారం ధృవీకరించారు. ఇరాన్‌లో మొత్తం 6,566 కేసులు నమోదు కాగా.. 194 మంది ప్రాణాలు విడిచారు. ఇటలీలో ఒక్కరోజే 133 మంది మరణించటంతో మృతుల సంఖ్య 366కు చేరుకుంది. అదేవిధంగా మొత్తం కేసులు 5,883 అయ్యాయి. ఈ మహమ్మారి భారత్‌లోనూ పుంజుకుంటోంది. సోమవారం కశ్మీర్, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో బయటపడిన నాలుగు కేసులతో కలిపి వైరస్ బాధితుల సంఖ్య 43కి చేరింది.
(చదవండి: కేరళను వణికిస్తున్న కరోనా వైరస్..!)
Comments
Please login to add a commentAdd a comment