పొకాంగో వేషధారణలో యువకులు
కెపూ/జకార్తా: మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) నుంచి ప్రజలను కాపాడుకునేందుకు వైరస్ ప్రభావం ఉన్న వివిధ దేశాలు లాక్‌డౌన్ విధించాయి. ఇంట్లోనే సురక్షితంగా ఉంటూ.. వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ అంటువ్యాధిని తరిమికొట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇక ఇండోనేషియా కూడా తన పౌరులకు ఇలాంటి సూచనలే చేసింది. అయితే మారుమూల గ్రామాల్లో కరోనా గురించి అవగాహన లేనివారు నేటికీ వీధుల్లో సంచరిస్తున్నారు. వైరస్ గురించి హెచ్చరించినా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఇండోనేషియాలోని కెపూ గ్రామానికి చెందిన యువకులు వినూత్న ప్రయోగానికి తెరతీశారు. దెయ్యం బూచిని చూపించి ప్రజలను ఇంట్లోనే ఉండేలా చేస్తున్నారు. (నిర్లక్ష్యమే కొంపముంచింది.. ట్రంప్ ఫైర్!)
ఈ మేరకు వారే పొకాంగ్(తెల్లటి బట్టలో చుట్టబడిన మృతదేహం- దెయ్యంగా వ్యవహరిస్తారు) అవతారమెత్తి అర్ధరాత్రి వీధుల్లో సంచరిస్తున్నారు. బతిమాలి చెప్పితే వినని వారిని భయంతో దారికి తెస్తున్నారు. ఇందుకు పోలీసుల అనుమతి కూడా తీసుకున్నారు. ఈ విషయం గురించి గ్రామ పెద్ద మాట్లాడుతూ.. ‘‘కోవిడ్-19 గురించి ఎంత చెప్పినా కొంతమందికి అర్థం కావడం లేదు. ఇంట్లో ఉండమని చెబితే ఎదురుతిరుగుతున్నారు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు చిన్నా పెద్దా ఇంట్లోనే ఉంటున్నారు. మూఢ నమ్మకాలే మమ్మల్ని కాపాడుతున్నాయి’’అని వెల్లడించారు. కాగా కరోనాతో ఇప్పటివరకు ఇండోనేషియాలో 373 మంది మరణించగా... 4241 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. (కుప్పలుగా శవాలు.. అక్కడే ఎందుకు ఎక్కువ మరణాలు?)
Comments
Please login to add a commentAdd a comment