టెహ్రాన్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి కోవిడ్-19 చైనాలో తగ్గుముఖం పట్టగా ఇటలీ, ఇరాన్‌లలో మృత్యు ఘంటిక మోగిస్తోంది. గురువారం ఒక్కరోజే ఇటలీలో రికార్డు స్థాయిలో 250 మంది కరోనా మరణాలు సంభవించాయని అధికారులు తెలిపారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 1266కు చేరుకుందని, 17,660 మంది చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఇక ఇరాన్‌లోనూ శుక్రవారం ఒక్కరోజే సుమారు 97 మంది బలయ్యారు. దీంతో ఇప్పటివరకూ ఈ వ్యాధి కారణంగా మరణించిన వారి సంఖ్య 611కు చేరుకుందని, 12,729 మంది వ్యాధి బారిన పడ్డారని ఇరాన్ అధికార టెలివిజన్ ఛానెల్ ప్రకటించింది.
కాగా, చైనాలో మరణాలు గణనీయంగా తగ్గిపోయాయి. తాజాగా శుక్రవారం చైనా మొత్తమ్మీద 13 మంది కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోగా కొత్తగా వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య 11గా ఉంది. నిర్ధారిత కేసుల సంఖ్య 80,859కు చేరుకున్నట్లు ఆరోగ్య కమిషన్ అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ చైనాలో 3,189 మంది కోవిడ్ కారణంగా మరణించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 5 వేలకు పైగా ఉంది. ఇక భారత్‌లో వైరస్ బాధితుల సంఖ్య 93 కు చేరుకుంది. ఇద్దరు మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment