గ్వదార్ వద్ద దృశ్యం
హంగ్ కాంగ్ : బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మిస్తున్న చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ) విషయంలో నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చైనాలోని జిన్‌జియాంగ్ నుంచి పాక్‌లోని గ్వదార్ పోర్టు గుండా ఈ ప్రాజెక్టు మార్గం వెళ్తోంది. అయితే గ్వదార్ వద్ద దీనికి పెను ముప్పు పొంచి ఉన్నట్లు వారు చెబుతున్నారు.
‘చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హంగ్ కాంగ్’కు చెందిన సీనియర్ శాస్త్రవేత్త యాంగ్ హంగ్‌ఫెంగ్ ఈ తీర ప్రాంతంపై మూడు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్వదార్ చాలా ప్రమాదకరమైన ప్రాంతం అని ఆయన చెబుతున్నారు. మక్రాన్ ట్రెంచ్‌కు సమీపంలో ఉన్న గ్వదార్ పోర్టు గతంలో పెను భూకంపంతో సర్వనాశనం అయ్యింది. 1945లో రిక్చర్ స్కేల్‌పై 8.1 తీవ్రతతో పెను భూకంపం ఇక్కడ సంభవించింది. సునామీ దాటికి ఇరాన్, పాక్, ఒమన్, ఇండియా తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఈ ప్రకృతి విలయంలో 4 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఆ ప్రాంతం గుండానే చైనా మెగా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది.
ఇందుకోసం 40 ఏళ్లపాటు చైనా ఈ ప్రాంతాన్ని లీజుకు తీసుకుంది. అంతేకాదు ఇక్కడ ఓ నేవల్ బేస్‌ను నెలకొల్పాలన్న ఆలోచనలో డ్రాగన్ కంట్రీ ఉండగా.. భారత్ దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇక ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆసియా, ఆఫ్రికా, యూరప్ దేశాలకు రవాణా సదుపాయాలు, ఆర్థికాభివృద్ధి సాధించాలన్నది చైనా లక్ష్యం. కానీ, ఇప్పుడు భూకంపం, సునామీ ప్రభావితమైన ఈ ప్రాంతం వల్ల ప్రాజెక్టుపైనే కాకుండా.. పాక్-చైనాలోని తీర ప్రాంతాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయినా ఈ అంశాన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని బీజింగ్ విదేశాంగ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. మరి దీనిపై పాక్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment