
వాషింగ్టన్ : బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మిస్తున్న చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ వల్ల ఉపఖండంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశముందని అమెరికాకు చెందిన మేధావులు అంచనా వేస్తున్నారు. సీపీఈసీ ప్రాజెక్ట్ వల్ల భారత్-పాకిస్తాన్ మధ్య మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశముందని విల్సన్ సెంటర్ దక్షిణాసియా డిప్యూటీ డైరెక్టర్ మైఖేల్ కూగల్‌మెన్ పేర్కొన్నారు. సీపీఈసీ ప్రాజెక్ట్ నిర్మించడం చైనా బలీయమైన కోరిక. ఈ కోరికే భారత్-పాకిస్తాన్‌ల మధ్య మళ్లీ మంటలు పుట్టించే అవకాశముందని ఆయన అన్నారు. ఈ కారిడార్ నిర్మాణ వ్యయాన్ని పాకిస్తాన్ ఇప్పుడున్నపరిస్థితుల్లో భరించగలదా అన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రధానంగా విద్యుత్ సంస్థల ఏర్పాటుకు పాకిస్తాన్ ఆర్థిక సహకారం అందించే విషయంపై ఆయన అనుమానాలు లేవనెత్తారు.
సీపీఈసీ ప్రాజెక్ట్ వల్ల ఉత్పత్తి అయ్యే విద్యుత్ పాకిస్తాన్ అవసరాలకు ఏమాత్రం సరిపోదని ఆయన చెప్పారు. చైనా ఆసక్తి, కోరికల మేరకు పనిచేయడం అనేది.. పాకిస్తాన్ రక్షణ, ఆర్థిక వ్యవస్థలను పూర్తిగా నాశనం చేసుకోవడమేనని అభిప్రాయపడ్డారు. ఇదిలావుండగా ఇప్పటికే సీపీఈసీ ప్రాజెక్ట్‌ను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ముందుకు సాగడం అనేది.. ఆసియాలో ఉద్రిక్తతలకు దారితీసే అవకాశముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment