హెర్బల్, నేచురల్ సిగరెట్లతోనూ ప్రమాదమే..!
పొగరాయుళ్ళకు మరో షాక్... ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా... అందుకు బానిసలైనవారు మాత్రం మానలేకపోతుంటారు. కొందరు మానేందుకు ప్రయత్నించే మార్గంలో ఇతర అలవాట్లను చేసుకుంటే, కొందరు హెర్బల్ సిగరెట్లు, బీడీల వంటి ప్రత్యామ్నాయాలను ఆశ్రయిస్తుంటారు. అయితే సిగరెట్ ఎలాంటిదైనా ప్రమాదమే అంటున్నారు వైద్య నిపుణులు. ధూమపానం... స్ట్రోక్, ఊపిరితిత్తుల క్యాన్సర్, కొరోనరీ ఆర్టరీ వంటి వ్యాధులకు కారణమౌతుందని, క్లోవ్ (లవంగం) సిగరెట్లను కూడ టుబాకోతో కలిపే తయారు చేస్తారని చెప్తున్నారు. మారుమూల గ్రామాల్లోనూ, పల్లెల్లోనూ వాడే బీడీల అలవాటుకూడ ఆరోగ్యానికి హాని చేకూరుస్తుందని హెచ్చరిస్తున్నారు.
సిగరెట్లలో ఉండే నికోటిన్ మనుషులను బానిసలుగా మారుస్తుంది. అంతేకాక గుండె జబ్బులు, కొరోనరీ ఆర్టెరీ వ్యాధులకు, ఊపిరితిత్తుల క్యాన్సర్ కు కారణమౌతుంది. ఈ నేపథ్యంలో ధూమపానాన్ని మానుకోలేని వారు సాధారణ సిగరెట్లకు ప్రత్యామ్నాయంగా హెర్బల్, నేచురల్ సిగరెట్లను ఆశ్రయిస్తుంటారు. కొంతలో కొంత ఈ సిగరెట్లు ఆరోగ్యానికి హాని కలిగించవని నమ్ముతారు. అయితే ఈ హెర్బల్, నేచురల్ సిగరెట్లవల్ల కూడ ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం అన్న విషయాన్ని గుర్తించక, మంచివే అన్న భ్రమలో రోగాలను కొనితెచ్చుకుంటారు. హెర్బల్ పదార్థాలు కూడ కాలుతున్నపుడు కార్బన్ మోనాక్సైడ్ వంటి హానికారక టాక్సిన్స్ ను విడుదల చేస్తాయి. అటువంటి హెర్బల్ సిగరెట్ల పొగను పీల్చుకున్నపుడు శ్వాస ద్వారా టాక్సిన్ నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. అందుకే ఫెడరల్ ట్రేడ్ కమిషన్ లెక్కల ప్రకారం హెర్బల్ సిగరెట్లపై కూడ ఆరోగ్యానికి హానికరం అన్న హెచ్చరిక ఇవ్వాల్సి ఉంది.
హెర్బల్ సిగెరెట్లు కూడ సాధారణ సిగరెట్లలాగే ఆరోగ్యానికి తీవ్ర నష్టాన్ని కలుగ జేస్తాయన్న విషయం పొగరాయుళ్ళకు షాక్ కలిగించవచ్చు. అయితే వీటిలో అభిరుచి పుష్పం, మొక్కజొన్న పట్టు, గులాబీ రేకులు, తామర ఆకు , లికోరైస్ వేరు , మల్లెపూవు, గిన్సెంగ్, ఎర్ర లవంగ పూలను వాడుతుంటారు. కాగా లవంగాల వంటివి వాడే హెర్బల్ సిగరెట్ల లాగానే బీడీలు కూడ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లవంగం సిగరెట్లలో 60 నుంచి 70 శాతం టుబాకోతో పాటు.. 30 నుంచి 40 శాతం మాత్రమే లవంగాలను వాడతారు. దీంతో ఈ ప్రత్యామ్నాయ సిగరెట్టలో పొగాకు ఉత్పత్తులకంటే ఎక్కువగా నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్ ఉంటుందని, ఇది కూడ ధూమపానంకంటే ఆరోగ్యానికి అధిక హాని కలిగిస్తుందని పరిశోధనల ద్వారా తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాదరణ పొందిన బీడీల్లో కూడ శుద్ధి చేయని, వడకట్టని టుబాకో వాడతారని, సిగరెట్లకన్నా తక్కువ ధర ఉండటంతో వీటిని గ్రామాల్లో ఎక్కువగా వాడుతుంటారని, వీటిలో ఉండే నికోటిన్ ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తుందని చెప్తున్నారు.