షష్టిపూర్తి రోజున మాఫియాడాన్ వారసుడి ప్రకటన? | dawood ibrahim likely to announce successor on 60th birthday | Sakshi
Sakshi News home page

షష్టిపూర్తి రోజున మాఫియాడాన్ వారసుడి ప్రకటన?

Published Thu, Dec 24 2015 3:44 PM | Last Updated on Sun, Sep 3 2017 2:31 PM

షష్టిపూర్తి రోజున మాఫియాడాన్ వారసుడి ప్రకటన?

షష్టిపూర్తి రోజున మాఫియాడాన్ వారసుడి ప్రకటన?

పాకిస్థాన్‌లో ఉండి.. ముంబై నేర సామ్రాజ్యాన్ని శాసిస్తున్న మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఇక రిటైర్ అవుదామని చూస్తున్నట్లుంది. శనివారం షష్టిపూర్తి చేసుకోబోతున్న దావూద్.. ఆరోజు తన వారసుడిని ప్రకటించే అవకాశం ఉందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. తన సోదరులలో ఒకరిని వారసుడిగా చేయొచ్చని, అందులో అనీస్ అహ్మద్‌కు అవకాశాలు ఎక్కువని అంటున్నారు. ఇక దావూద్ గ్యాంగులో అత్యంత కీలకమైన వ్యక్తి, గ్యాంగు సీఈవోగా చెప్పుకొనే ఛోటా షకీల్‌కు అతడి స్థానం యథాతథంగా ఉంచుతారని తెలుస్తోంది.

అయితే, సాధారణంగా దావూద్ ఏం చేసినా ముంబైలోని బిగ్‌షాట్లకు తెలిసిపోతుంది. వాళ్లు కూడా 'భాయ్' దిగిపోతున్న విషయం తమకు తెలియదనే అంటున్నారు. కేవలం కొద్దిమందికి మాత్రమే తెలిసిన ఈ విషయాన్ని తన 60వ పుట్టినరోజు సందర్భంగా జరిగే పార్టీలో ప్రకటిస్తాడని అంచనా. పార్టీ ఎక్కడ జరుగుతుందన్న విషయం కూడా టాప్ సీక్రెట్‌గా ఉంచారు. పార్టీకి పిలిచినవాళ్లకు కూడా ఎక్కడన్న విషయం చివరి నిమిషంలోనే చెబుతున్నారు. డ్రగ్స్, బెట్టింగ్, హవాలా, ఆయుధాల స్మగ్లింగ్ లాంటి వ్యవహారాల ద్వారా 66 వేల కోట్ల రూపాయల డి కంపెనీ సామ్రాజ్యం తన అనారోగ్యం కారణంగా కుప్పకూలకూడదని దావూద్ భావిస్తున్నట్లు తెలిసింది. రాబోయే రెండు మూడేళ్ల పాటు మాత్రమే తాను కూడా ఉండి.. వచ్చేవాళ్లకు కాస్త మార్గదర్శనం చేయాలన్నది దావూద్ ప్లాన్ అంటున్నారు.

దావూద్ సోదరుల్లో నూరుల్ హక్ అలియాస్ నూరా చనిపోయాడు. ఇక్బాల్ కస్కర్‌ను దుబాయ్ నుంచి వెనక్కి పంపేశారు. దాంతో మరో ముగ్గురు సోదరులు మాత్రమే ఉన్నారు. వాళ్లు అనీస్, హుమాయూన్, ముస్తఖీమ్. వీళ్లలో అనీస్ తప్ప మిగిలిన ఇద్దరూ గ్యాంగు కార్యకలాపాల్లో అంత చురుగ్గా ఉండరు. ముస్తఖీమ్‌ ఒక ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. దాంతో అతడు ఇంటికే పరిమితం. దాంతో ఇక ఛోటా షకీల్ సాయంతో అనీస్ గ్యాంగు పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

కూతుళ్ల ఒత్తిడి
దావూద్ ఇబ్రహీంకు మహరూఖ్, మోయిన్ అనే ఇద్దరు కూతుళ్లున్నారు. వాళ్లలో మహరూఖ్‌ను మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ కొడుకు జునైద్ మియాందాద్‌కు ఇచ్చి పెళ్లి చేశాడు. మోయిన్ నిఖార్సైన ముస్లిం. వీళ్లిద్దరూ కూడా తమ తండ్రిని ఇక పని ఒత్తిడి తగ్గించుకోవాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఎవరో ఒకరికి గ్యాంగు అప్పగించి ఇక విశ్రాంతి తీసుకోవాలని దావూద్ భార్య మెహజబీన్ కూడా ఎన్నాళ్ల నుంచో పోరు పెడుతోంది. అందుకే ఇక రిటైర్మెంటు గురించి డాన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement