ప్రతీకాత్మక చిత్రం
కరాచీ: మనిషి చనిపోయిన తర్వాత శరీరంలో కదలికలు ఏర్పడినట్లు వార్తలు రావడం సహజం. అనేకసార్లు ఈ తరహా వార్తలు మనం వింటూ వచ్చాం. డాక్టర్లు సరిగ్గా పరీక్షించకుండా రోగి మృతిచెందినట్లు ద్రువీకరించడమే ఇలాంటి వార్తలకు కారణంగా మనం భావించవచ్చు. తాజాగా ఇలాంటి సంఘటనే పాకిస్తాన్‌లోని కరాచీలో జరిగింది. వివరాల్లోకెళ్తే.. అనారోగ్యంతో బాధపడుతున్న రషీదా బీబీ అనే మహిళను అబ్బాసీ షాహిద్ ఆస్పత్రిలో చేర్పించారు. ఎన్నివిధాలుగా వైద్యులు చికిత్సనందించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో రషీదా మృతిచెందినట్లు ఆమె కుటుంబసభ్యులకు మరణ ధృవీకరణ పత్రాన్ని అందజేశారు.
తదనంతరం కుటుంబ సభ్యులు మృతదేహానికి అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందులో భాగంగా రషీదా బీబీ మృతదేహానికి శవాల గదిలో స్నానం చేయిస్తుండగా.. ఒక్కసారిగా రషీదా లేచి నిలబడింది. దీంతో స్నానం చేయిస్తున్న మహిళ, ఆ గదిలో ఉన్నవారు భయంతో అక్కడ నుంచి పరుగులు తీశారు. వారు జరిగిన విషయాన్ని రషీదా కుటుంబసభ్యులకు చెప్పడంతో అంతా షాకయ్యారు. డాక్టర్లు వచ్చి ఆమె పల్స్ చెక్ చేసి ఇంకా శ్వాస తీసుకుంటున్నట్లు గుర్తించారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంత్యక్రియల సమయంలో శవం లేచి నిలబడిందనే వార్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment