భారత్‌లో ‘మృత్యు’ వీచికలు! | deadly message to india | Sakshi
Sakshi News home page

భారత్‌లో ‘మృత్యు’ వీచికలు!

Published Sun, Feb 22 2015 2:19 AM | Last Updated on Sat, Sep 2 2017 9:41 PM

deadly message to india

 మనిషికి ఊపిరి ఊదాల్సిన ప్రాణ వాయువే గరళంగా మారుతోంది. వాయు కాలుష్యం రూపంలో మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నలువైపులా వ్యాపిస్తూ పంజా విసురుతోంది. భారత్‌లోని ప్రధాన నగరాల్లో అభివృద్ధి మాటున నక్కి ప్రజల ఆరోగ్యాన్ని పీల్చేస్తోంది. దేశ జనాభాలో దాదాపు సగం మంది జీవిత కాలాన్ని క్రమంగా హరిస్తూ అకాల మరణాలకు కారణమవుతోంది. ఒళ్లుగగుర్పొడిచే ఈ భయంకర పరిణామం కొత్త అధ్యయనంలో వెల్లడైంది.
 వాయు కాలుష్యానికి
 ప్రజలు ఉక్కిరిబిక్కిరి
     కాలుష్య కోరల్లో 66 కోట్ల మంది
     3.2 ఏళ్ల చొప్పున
     కరిగిపోతున్న జీవితకాలం
     అమెరికా వర్సిటీ అధ్యయన ం
 షికాగో: భారత్‌లోని తీవ్ర వాయు కాలుష్యం ప్రజల జీవితాలపై పెను ప్రభావం చూపుతున్నట్లు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ షికాగో, హార్వర్డ్, యేల్ ఆర్థికవేత్తలు చేపట్టిన అధ్యయనంలో తేలింది. దేశ జనాభాలో అత్యధికం మంది జీవితకాలాన్ని 3.2 ఏళ్ల చొప్పున హరిస్తోందని బయటపడింది. మరో మాటలో చెప్పాలంటే వాయు కాలుష్యం  200 కోట్ల జీవిత సంవత్సరాలను మింగేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. భారతీయుల్లో సుమారు 66 కోట్ల మంది ప్రజలు భారత ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకన్నా ఎక్కువగా కాలుష్యం విడుదలవుతున్న ప్రాంతాల్లో నివసిస్తున్నారని వర్సిటీ ప్రచురించిన ఈవారం ‘ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ’లో ఆర్థికవేత్తలు పేర్కొన్నారు.
 ప్రజారోగ్యంపై దృష్టి పెట్టకే: భారత్ సుదీర్ఘకాలంపాటు కేవలం అభివృద్ధిపైనే దృష్టిపెట్టి ప్రజల ఆరోగ్యంపై వాయుకాలుష్యం కలిగించే దుష్ర్పభావం గురించి పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. అయితే ఇప్పటికీ పరిస్థితి చేయిదాటిపోలేదని, భారత ప్రభుత్వం ఒకవేళ వాయు కాలుష్యాన్ని ప్రమాణాలకు అనుగుణంగా నియంత్రించగలిగితే తిరిగి ప్రజలందరికీ 3.2 ఏళ్ల జీవితకాలాన్ని ప్రసాదించేందుకు వీలవుతుందని  షికాగో వర్సిటీలోని ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ డెరైక్టర్, ఈ అధ్యయనం రచయితల్లో ఒకరైన మైఖేల్ గ్రీన్‌స్టోన్ తెలిపారు. వాయుకాలుష్యం వల్ల 200 కోట్ల జీవిత సంవత్సరాలు కోల్పోవడం భారీ మూల్యం చెల్లించుకోవడమేనని అధ్యయన బృందంలోని హార్వర్డ్ కెన్నడీ స్కూల్‌లోని ఎవిడెన్స్ ఫర్ పాలసీ డిజైన్ డెరైక్టర్ రోహిణి పాండే చెప్పారు.
 మార్పు ప్రభుత్వం చేతుల్లోనే...
 ప్రజలను ఈ విపత్కర పరిస్థితి నుంచి బయటపడేసే శక్తి భారత్ చేతుల్లోనే ఉందని పాండే అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఈ పరిస్థితిని మార్చి కోట్లాది మంది పౌరులు మరింత కాలం ఆరోగ్యంగా జీవించేందుకు దోహదపడాలన్నారు. ప్రస్తుత కాలుష్య నియంత్రణ నిబంధనల్లో సంస్కరణలు తె స్తే ప్రజల ఆరోగ్యం మెరుగుపడి దేశాభివృద్ధి పెరుగుదలకు బాటలు వేస్తుందన్నారు. కాలుష్య నియంత్రణపై పర్యవేక్షణను మెరుగుపరచడం, ఇందుకోసం అందుబాటులోకి వచ్చిన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం వంటివి చేయాలన్నారు. అలాగే కాలుష్య నిబంధనలను కఠినతరం చేయడంతోపాటు కాలుష్యం తగ్గించే సంస్థలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు. ఈ అధ్యయనంలో యేల్‌కు చెందిన నికోలస్ ర్యాన్, హార్వర్డ్‌కు చెందిన జాహ్నవి నీలేకని, అనిష్ సుగథాన్, అనంత్ సుదర్శన్ (ఎపిక్ ఇండియా డెరైక్టర్) కూడా పాల్గొన్నారు.
 ఈ అధ్యయనంలో తేలిన అంశాలు...
 
     దేశాభివృద్ధికి అడ్డంకిగా మారిన విపరీతమైన వాయు కాలుష్యం భారతీయుల్లో అకాల మరణాలకు కారణమవుతోంది.
     సుమారు 66 కోట్ల మంది భారతీయులు ఈ కాలుష్యం వల్ల 3.2 ఏళ్ల చొప్పున జీవిత కాలాన్ని కోల్పోతున్నారు.
     దీనివల్ల పనిలో ఉత్పాదకత తగ్గడం, అనారోగ్య సెలవులు పెరగడం, ఫలితంగా వైద్య ఖర్చులు పెరగడం వంటి పరిస్థితులు కూడా ఎదురవుతున్నట్లు ఇతర అధ్యయనాల్లో వెల్లడైంది.
     చైనా రాజధాని బీజింగ్‌లో 35 కాలుష్య పర్యవేక్షక కేంద్రాలు ఉంటే... భారత్‌లో అత్యధికంగా కోల్‌కతాలో 20 కేంద్రాలే ఉన్నాయి.
     {పపంచంలోని 20 అత్యంత వాయుకాలుష్య నగరాల్లో 13 నగరాలు భారత్‌లోనే ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంచనా వేసిన నేపథ్యంలో తాజా అధ్యయనం వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలో అత్యధిక కాలుష్యం ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.
     {పపంచంలోకెల్లా భారత్‌లోనే శ్వాస సంబంధ రోగాలతో మరణిస్తున్న వారి సంఖ్య అత్యధికం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement