హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసీ(ట్విటర్ ఫొటో)
వాషింగ్టన్: మహమ్మారి కరోనా సంక్షోభం నుంచి అమెరికాను గట్టెక్కించేందుకు ట్రంప్ సర్కారు ఇప్పటికే పలు ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా.. తాజాగా 3 ట్రిలియన్ డాలర్లతో కూడిన భారీ ప్యాకేజీ విడుదలకు రంగం సిద్ధం అయ్యింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ శుక్రవారం ఆమోదం తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడం సహా దేశ పౌరుల ఆరోగ్య అవసరాలు ప్రాధాన్యాంశాలుగా డెమొక్రాట్లు ఈ మేరకు బిల్లును ప్రతిపాదించారు.
కాగా వివిధ రాష్ట్రాలు నిధులు సమకూర్చుకునేందుకు, కోవిడ్ నిర్ధారణ పరీక్షలు, నిరుద్యోగులు, అద్దెదార్లు, ఇళ్ల యజమానులు, బకాయిలు చెల్లించలేని విద్యార్థులు ఈ ప్యాకేజీ ద్వారా ఉపశమనం పొందనున్నట్లు తెలుస్తోంది. 3 ట్రిలియన్ డాలర్లలో 1 ట్రిలియన్ డాలర్లు రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు... కరోనా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అమెరికన్ కుటుంబాలను ఆదుకోవడానికి నగదు పంపిణీ, చిన్న వ్యాపారస్తులకు బిల్లు ద్వారా లబ్ది చేకూర్చేలా బిల్లు రూపొందింది. (ట్రంప్ : డబ్ల్యూహెచ్‌ఓకు నిధుల కోత?)
ఇక ప్రతినిధుల సభలో మెజారిటీ డెమొక్రాట్లదే కావడంతో 208-199 ఓటింగ్ తేడాతో బిల్లును నెగ్గించుకున్నారు. అయితే అధికార పార్టీకి చెందిన ఓ రిపబ్లికన్‌తో పాటు 14 మంది డెమొక్రాట్లు కూడా ఈ బిల్లును వ్యతిరేకించడం గమనార్హం. ఇక ఈ బిల్లుపై ఓటింగ్ సందర్భంగా స్పీకర్ నాన్సీ పెలోసి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మానవతా దృక్పథంతో ఇప్పుడు కూడా మనం సరైన రీతిలో స్పందించకపోతే.. బాధ్యతారాహిత్యానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అమెరికన్ల జీవితాల్లో.. అమెరికా రాష్ట్రాలు, ప్రాంతాల బడ్జెట్‌లో ఇదే పెద్ద పెట్టుబడి అని భావిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. లాక్‌డౌన్ వల్ల అతలాకుతలమైన ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచి, సమస్యలను అధిగమించేలా చేయాలనుకుంటున్నామని వ్యాఖ్యానించారు.
కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రిపబ్లికన్లు ఈ బిల్లును సెనేట్‌లో అడ్డుకునేందుకు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లును ఎద్దేవా చేసిన రిపబ్లికన్లు.. వైట్‌హౌజ్‌లో వీటో(తిరస్కారం)కు గురవుతుందంటూ బెదిరింపు ధోరణి అవలంబించడం ఇందుకు నిదర్శనం. ఇక కరోనా సహాయక చర్యల్లో భాగంగా నాలుగోదశ ప్రారంభమైందని ట్రంప్ వైట్‌హౌజ్‌లో విలేకరులకు తెలిపారు. ఇందుకు సంబంధించిన చట్టంపై ఆయన సంతకం చేశారు. కాగా సహాయక చర్యల్లో భాగంగా మార్చిలో 2.2 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీ, చిన్న వ్యాపారులను ఆదుకునేందుకు 483 బిలియణ్ డాలర్ల ప్యాకేజీని ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక అమెరికా పన్ను చెల్లింపుదారులను ఆదుకునేందుకు పేరోల్ టాక్సులను తగ్గించాలని ట్రంప్ గత కొద్ది కాలంగా డిమాండ్ చేస్తున్న విషయం విదితమే. (కరోనా సంక్షోభం: 484 బిలియన్ డాలర్ల ప్యాకేజీ)
Comments
Please login to add a commentAdd a comment