మిస్ డయాబెటిక్ మనసు గెలుచుకుంది
Published Sat, Jul 19 2014 11:23 AM | Last Updated on Sat, Sep 2 2017 10:33 AM
20 ఏళ్ల సియర్రా సాండిసన్ ఇప్పుడు అమెరికన్ అమ్మాయిలకు సరికొత్త హీరోయిన్. ఆమె వారికి ఒక రోల్ మోడల్. ఈ అమ్మాయి ప్రత్యేకత ఏమిటంటే ఈమె డయాబెటిక్. ఆమె డయాబెటిస్ కూడా తీవ్ర స్థాయిలో ఉంది. అందుకు ఆమె ఎప్పుడూ ఇన్సులిన్ ను అందించే ఇన్సులిన్ పంప్ ను ధరించాల్సి ఉంటుంది.
మిస్ అమెరికా బ్యూటీ కాంటెస్ట్ లో సియర్రా తన ఇన్సులిన్ పంప్ ను ధరించి మరీ పాల్గొంది. తన ఆరోగ్య పరిస్థితిని ఆమె ఏ మాత్రమూ దాచలేదు. తాను ఇన్సులిన్ డిపెండెంట్ అన్న విషయం అందరికీ తెలిసేలా ఆమె పోటీలో పాల్గొంది. తన ఫోటోలను ఫేస్ బుక్ లో పెట్టింది.
అమెరికాలో పుట్టుకతోనే వచ్చే టైప్ వన్ డయాబెటిస్ బాధితుల సంఖ్య చాలా ఎక్కువ. వీరంతా తీవ్ర నిరాశా నిస్పృహలతో జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అలాంటి వారిలో ఆశలు చిగురింపచేసేందుకే సియర్రా ఇన్సులిన్ పంప్ ను ధరించింది. అందుకే ఇప్పుడు ఆమె చాలా మంది డయాబెటిక్స్ కి రోల్ మోడల్ అయింది.
1999 మిస్ అమెరికా నికోల్ జాన్సన్ కూడా డయాబెటిక్ వ్యాధి పీడితురాలే. కానీ ఆమె బయటకు కనిపించకుండా ఇన్సులిన్ పంప్ ను ధరించింది. సియర్రా తన ఇన్సులిన్ పంప్ ను దాచుకోలేదు. ఆమె బహిరంగంగా దాన్ని ప్రదర్శించింది. ఆమె మిస్ అమెరికా పోటీలో గెలవలేకపోయినా, కోట్లాది అమెరికన్ల హృదయాలను మాత్రం ఖచ్చితంగా గెలుచుకుంది.
Advertisement