ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: రక్తపోటును (బీపీ) ‘సైలెంట్ కిల్లర్’గా వైద్యులు అభివర్ణిస్తుంటారు. బీపీ నియంత్రణలో లేకపోతే గుండెపోటు, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులు, కంటిచూపు కోల్పోవడం, డిమెన్షియా వంటివి సంభవిస్తాయి. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో బీపీ, షుగర్ వంటివి నియంత్రణలో లేక రోగ నిరోధకశక్తి తగ్గి సులభంగా కరోనా బారిన పడే ప్రమాదం ఎన్నో రెట్లు పెరిగినట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేప థ్యంలో ‘మీ రక్తపోటు ఎంతుందో కచ్చితంగా తెలుసుకోండి. దాన్ని నియంత్రణలో ఉంచండి. దీర్ఘ కాలం జీవించండి’ అనే నినాదంతో ‘వరల్డ్ హైపర్ టెన్షన్ లీగ్’ముందుకు సాగుతోంది. నేడు వరల్డ్ హైపర్‌టెన్షన్ డే. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రక్తపోటుతో ముడిపడిన అంశాలు, సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కన్సల్టెంట్ ఫిజీషియన్ డా.ప్రభుకుమార్ చల్లగాలి ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
సమస్య గుర్తించగానే చికిత్స చేయాలి..
రక్తపోటులో వస్తున్న మార్పులను గుర్తిస్తే.. వీలైనంత త్వరగా చికిత్స ప్రారంభించాలి. దాదాపు 50 శాతం మందికి వారిలో బీపీ సమస్య ఉన్నట్లు అవగాహన కూడా ఉండట్లేదు. బీపీ పెరగడం వల్ల రక్తనాళాలు దెబ్బతింటాయి. రక్తనాళాల్లో కొవ్వులు చేరడంతో లోపలి పొర చిట్లిపోయే ప్రమాదం ఉంది. వరల్డ్ హైపర్‌టెన్షన్ లీగ్ (డబ్ల్యూహెచ్‌ఎల్) సూచనల ప్రకారం బీపీ ఉందో లేదో తెలుసుకునేందుకు వీలైనంత త్వరగా పరీక్షలు చేయించుకోవాలి. ఇందుకోసం డాక్టర్ల వద్ద ఉండే స్ఫిగ్మో మానోమీటర్లు అవసరం లేదు. అందుబాటులోకి వచ్చిన బీపీ డిజిటల్ మీటర్ల ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
ఎల్లప్పుడూ 140 నుంచి 80 లోపు రక్తపోటు ఉండేలా చూసుకోవాలి. ముందుగా దీన్ని గుర్తించి మందులు వాడితే ఎక్కువ కాలం జీవించి ఉండేందుకు అవకాశం ఉంటుంది. వారం నుంచి 10 రోజుల పాటు బీపీ చెక్ చేసి, సరాసరి పాయింట్లు పరిగణనలోకి తీసుకున్న తర్వాతే బీపీ ఉందో లేదో నిర్ధారణ చేసుకోవాలి. 140 నుంచి 90 లోపు బీపీ లేకపోతే వెంటనే మందులు వాడాలి. అనియంత్రిత రక్తపోటు ఎక్కువ కాలం ఉంటే కిడ్నీలు పాడవుతాయి. కంటి వెనుక భాగంలో రక్తనాళాలు చిట్లి బ్లడ్ స్పాట్స్ కనిపించడంతో పాటు కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉంది. గుండెలో, మెదడులో రక్తనాళాలు చిట్లే అవకాశాలుంటాయి. మెదడులో రక్తం గడ్డ కట్టే ప్రమాదమూ లేకపోలేదు.
బీపీ పేషెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
► బీపీని నియంత్రణలో ఉంచుకోవాలి.
► క్రమంతప్పకుండా బీపీ మందులు వాడాలి.
► తేలికపాటి వ్యాయామాలు చేయాలి. మెల్లగా ఎక్సర్‌సైజులు పెంచాలి.
► తాజా ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు తినాలి.
► కిడ్నీ సమస్యలున్న వారు, రక్తంలో సమస్యలున్న వారికి ప్రోటీన్ ఫుడ్‌తో సమస్యలు వస్తాయి. చేపలు, కోడిగుడ్లు, పాలు ఎక్కువగా తీసుకోవాలి.
► కోవిడ్ బాధితులు ఆందోళనతో బీపీ పెంచుకుంటున్నారు. అలా ఆందోళన చెందొద్దు.
► కరోనా బాధితుల్లో బీపీ, షుగర్ స్థాయిలు కంట్రోల్‌లో ఉండేలా చూసుకోవాలి. అందుకు తగిన మందులు వాడాలి.
► బీపీ ఉన్న వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు 7 రెట్లు పెరుగుతాయి. బీపీతో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల సులభంగా కోవిడ్ బారిన పడే అవకాశాలుంటాయి.
ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి..
కోవిడ్ రాక ముందే జాగ్రత్త చర్యల్లో భాగంగా రక్తపోటు నియంత్రణలో ఉండాలి. బీపీ కంట్రోల్‌లో లేకపోతే రక్త ప్రసరణ బాగా పెరిగి గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌కు దారితీస్తాయి. అందువల్ల ముందుగానే మందులు వాడి బీపీని నియంత్రణలో ఉంచుకోవాలి. అందువల్లే కరోనా చికిత్స సమయంలో రక్తాన్ని పలుచన చేసే మందులు వాడుతారు. లో డెన్సిటీ లిపో ప్రోటీన్లు రక్తంలో, రక్తనాళాల్లో పెరిగితే గుండెపోటు వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment