Durga Suneel Vasa Says Food Change Is Must To fight Against Coronavirus - Sakshi
Sakshi News home page

వైరస్‌నూ ఓడించొచ్చు: చైనీయులు ఏం చేశారో తెలుసా?

Published Thu, May 27 2021 10:08 AM | Last Updated on Thu, May 27 2021 12:14 PM

Coronavirus: Durga Suneel Vasa Says Food Change Must For Fight Against Covid - Sakshi

►  కోవిడ్‌ వైరస్‌ చైనాలోనే పుట్టినా.. మనకంటే జనాభాలో పెద్దదైనా.. ఎందుకు ఆ దేశం మనంతగా ఇబ్బంది పడటం లేదు..? అక్కడి విషయాలు బయటి ప్రపంచానికి పెద్దగా తెలిసే పరిస్థితి లేనప్పటికీ, ఆ దేశం కోవిడ్‌తో మనంతగా ఇబ్బంది పడటం లేదన్నది మాత్రం వాస్తవం. కారణమేంటి.. అని ప్రశ్నిస్తే.. ఆ దేశ ప్రజల ఆహారపు అలవాట్ల వల్లనే అంటున్నారు ఇంటిగ్రేటెడ్‌ స్పెషలిస్టు, మైక్రో బయోలజిస్టు డాక్టర్‌ దుర్గా సునీల్‌ వాస. 

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ వైరస్‌ చైనాకు కొత్తేమీ కాదు. చాలా కాలంగా దానితో ప్రజలు సహజీవనం చేస్తున్నారు. కోవిడ్‌ కంటే ముందు చాలా వైరస్‌లకు చైనానే పుట్టినిల్లు. ఇది అక్కడి ప్రజల ఆహార విషయాల్లో ఎంతో మార్పు తెచ్చింది. వైరస్‌ల దుష్ప్రభావాలను ఎదుర్కొనేలా వారి శరీరాన్ని మలుచుకునేందుకు ఆహారంలో మార్పులు చేసుకోవటం చైనీయులకు అలవాటు. అందుకే వైరస్, బ్యాక్టీరియా పుట్టగా పేర్కొనే గబ్బిలాన్ని సైతం చైనీయులు ఆహారంలో లాగించేస్తారు.

కానీ దానితోపాటు కొన్ని ఔషధ గుణాలున్న దినుసులు, ఆకులను జోడిస్తారు. గబ్బిలంతో వచ్చే సమస్యలను ఈ ఔషధ గుణాలున్న దినుసులు రక్షిస్తున్నాయి. ఇప్పుడు మన దేశం కోవిడ్‌తో అల్లాడుతుంటే, చైనా నిబ్బరంగా ఉండేందుకు ఇదే ప్రధాన కారణంగా మారిందని డాక్టర్‌ సునీల్‌ వాస వివరిస్తున్నారు. మన దేశంలో కూడా ఆ రకమైన మార్పు చాలా అవసరమని సూచిస్తున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

స్థానిక వైద్యానికీ చైనా పెద్దపీట
మనకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా అల్లోపతి మందు వాడటం అలవాటు. అల్లోపతిలో ఎన్నో విప్లవాత్మక పరిశోధనలు చేస్తున్న చైనా, అదే సమయంలో స్థానిక వైద్య విధానాన్నీ అనుసరిస్తోంది. 80 శాతం మంది చైనా ప్రజలు స్థానిక వైద్యాన్ని అనుసరిస్తారు. మనకంటూ వైద్య విధానాలున్నా.. వాటిని అనుసరించేవారు మన దేశంలో చాలా తక్కువ. కానీ చైనీయులు దీనికి పూర్తి విరుద్ధం.

అక్కడి స్థానిక వైద్యం వారి ఇంటిలో భాగం. దానికి సంబంధించిన మందుల్లో శరీర రోగనిరోధక శక్తిని పెంచే ఔషధ మొక్కల గుణాలు పుష్కలంగా ఉంటాయి. క్రమంగా బ్యాక్టీరియాలు, వైరస్‌లను తట్టుకునేలా వారి శరీరాలను మార్చేం తగా అక్కడి వైద్యవిధానం ఉపయోగపడుతోంది. చైనా కొన్ని రకాల మసాలా దినుసులను బాగా పండిస్తోంది. వాటిని జనం విపరీతంగా వాడతారు. 

అప్పటి మన వంటకాలు ఇప్పుడేవీ..
మన పూర్వీకులు ఎన్నో సంప్రదాయ ఔషధ గుణాలున్న పదార్థాలను వంటల్లో భాగం చేసుకున్నా, క్రమంగా మనం వాటికి దూరమవుతూ వచ్చాం. గతంలో వంటల్లో కారం కోసం మిరియాలను వాడేవారు. అద్భుత ఔషధ గుణాలు దాని సొంతం. కానీ ఇప్పుడు మిరియాల వాడకం నామమాత్రం. ఇలా ఎన్నింటినో దూరం చేసుకున్నాం. అలా మన శరీరాలు రోగనిరోధక శక్తిని కోల్పోతూ వస్తున్నాయి. ఇప్పుడు కోవిడ్‌ విపరీతంగా ప్రభావం చూపటానికి అది కారణమవుతోంది. మన నిత్యం చూసే కొన్ని మసాలా దినుసులు, కూరగాయలు, పళ్లు క్రమం తప్పకుండా వాడితే కోవిడ్‌ను కూడా తట్టుకునేలా మన శరీరం సిద్ధమవుతుంది. 

‘టూడీజీ’లోని ఓ గుణం పసుపు సొంతం
కోవిడ్‌ను కట్టడి చేసే మందుగా ఇటీవల బాగా వినిపిస్తున్న పేరు టూడీజీ. ఈ మందులోని ఓ గుణం పసుపు సొంతం. పసుపులో బెర్బెరీన్‌ అనే కెమికల్‌ ఉంటుంది. ఇది శరీరంలో ఉత్పత్తి అయ్యే షుగర్‌ను చెడు బ్యాక్టీరియా, వైరస్‌లకు అందకుండా కట్టడి చేయగలదు. షుగర్‌ అందకుంటే అవి బలహీనపడతాయి. గతంలో పసుపును బాగా వాడేవారు. కానీ పాశ్చాత్య ఆహారపు అలవాట్లలో పసుపు వినియోగం చాలా తక్కువ. అలా ఇప్పుడు చాలా ఆహారపదార్థాల్లో పసుపు మాయమైంది. పసుపులో దీంతోపాటు మరిన్ని కెమికల్స్‌ ఉన్నాయి. అవి శరీరానికి బాగా పట్టాలంటే మిరియాలు తోడు కావాలి. అంటే పసుపుతోపాటు మిరియాల వాడకం చాలా అవసరం. కానీ మనం మిరియాల వాడకాన్ని దాదాపు మరిచిపోయాం. 

కరివేపాకు, కొత్తిమీర ఎంతో మేలు
కరివేపాకులో ఉండే ట్రిప్తాంత్రిన్‌ అనే రసాయనం కోవిడ్‌ వైరస్‌ ఉధృతిని తగ్గిస్తుంది. ఇది పరిశోధనలో కూడా తేలింది. కానీ మనం కూరల్లో దాన్ని విరివిగా వాడతాం, అయితే తినేప్పుడు తీసి పడేస్తాం. అందరికీ దాన్ని విరివిగా తినే అలవాటు ఉండి ఉంటే వైరస్‌పై అది దానిపని అది చేసుకుపోయేది. కరివేపాకుతో కలిపి వాడే కొత్తిమీరలో లీట్యోలిన్‌ అనే ఫ్లేవనాయిడ్‌ ఉంటుంది. తులసిలో కూడా ఈ రసాయనం ఉంటుంది. పాలకూరలో క్వురిసిటిన్, క్యాంఫెరాల్, మిర్సిటిన్‌లాంటి ఫ్లేవనాల్స్‌ ఉంటాయి. ఇవి క్యాబేజీ, క్యాలిఫ్లవర్, బ్ర కోలిలో కూడా ఉంటాయి.

ఇవి యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తాయి, యాంటీ వైరస్‌తోపాటు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ శక్తి ఉంటేనే వైరస్‌కు కట్టడి ఉంటుంది. ఆ విషయంలో ఇవి సమర్థవంతంగా పనిచేస్తాయి. లీట్యోలిన్‌ అధికంగా ఉండే బెండకాయ కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. చిక్కుడు జాతి కూరలు కూడా వైరస్‌పై ప్రభావం చూపగలవు. శరీరంలో ఉండే మాస్ట్‌ సెల్స్‌ ఉత్తేజం చెందితే వైరస్‌ సులభంగా విస్తరిస్తుంది. అవి ఉత్తేజం చెందకుండా లిట్యోలిన్‌ ఉపయోగపడుతుంది. 

ఈ పండ్లతో స్పైక్‌ ప్రొటీన్‌కు చెక్‌
కరోనా వైరస్‌ స్పైక్‌ ప్రోటీన్‌ను దెబ్బతీసే హెస్ప్రిడిన్‌ ఉండే నారింజ, బత్తాయి, సంత్రా, దబ్బకాయ, నిమ్మలాంటి వాటిని అధికంగా తీసుకోవాలి. ఆ రసాయనం పండు కంటే పొట్టులో ఎక్కువగా ఉంటుంది. ఆ పొట్టును కూడా మనం వినియోగించుకోగలగాలి. పొట్టుతో తయారు చేసిన పొడులు కూడా అందుబాటులో ఉంటాయి. వాటిని వాడాలి. నల్ల ద్రాక్ష యాంటీ వైరల్‌ గుణాలను కలిగి ఉంటాయి. బెర్రీస్‌లో యాంథోసియానీన్‌లు పుష్కలంగా ఉంటాయి. ఉసిరి యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తుంది. 

మనం కూడా మారాలి
ఇవన్నీ మన చుట్టూనే ఉంటాయి. కానీ మన జీవన శైలి మారిపోయి, పాశ్చాత్య పోకడలు పెరిగిన తర్వాత వీటి వినియోగం తగ్గిపోయింది. మళ్లీ వీటిని బాగా వినియోగించుకోవటంతో పాటు వైరస్‌పై సమర్ధవంతంగా పోరాడే గుణాలున్న మసాలా దినుసులను వంటల్లో భాగం చేసుకుంటే సమీప భవిష్యత్తులో వైరస్‌లను తట్టుకోగలిగే రోగనిరోధక శక్తి మన వశమవుతుంది. కోవిడ్‌ ఇప్పటికిప్పుడు మాయమయ్యేది కాదు. మరికొన్నేళ్లపాటు దాని ప్రభావం ఉంటుంది. బ్లాక్‌ ఫంగస్, వైట్‌ ఫంగస్‌లాంటివి ఉత్తేజం చెందుతున్నాయి. వాటి బారిన పడకుండా ఉండాలంటే మనం కూడా కచ్చితంగా మారాలి.
చదవండి: e- pass: కావాలా.. ఇలా అప్లై చేసుకోండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement