సాక్షి సెంట్రల్ డెస్క్: కరోనా సోకి తగ్గాక మనలో ఇమ్యూనిటీ ఏర్పడుతుంది. ఈ ఇమ్యూనిటీ రెండు, మూడు నెలలు ఉండొచ్చని కొందరు.. ఆరు నెలల వరకూ ఉంటుందని మరికొందరు అంచనా వేస్తూ వచ్చారు. ఇలాంటి సమయంలో తాజా పరిశోధనలు శుభవార్త చెప్తున్నాయి. కరోనా సోకి తగ్గినవారిలో ఏడాది వరకు ఇమ్యూనిటీ ఉంటుందని, వ్యాక్సిన్ వేసుకుంటే ఇంకొంత ప్రయోజనమని స్పష్టం చేస్తున్నాయి. ఆ వివరాలేమిటో తెలుసుకుందామా..
ఇమ్యూనిటీ ఎంత కాలం..?
కరోనా వైరస్ సోకి కోలుకున్న వారిపై ఇటీవల రాక్‌ఫెల్లర్ యూనివర్సిటీ, మరికొందరు శాస్త్రవేత్తలు వేర్వేరుగా పలు పరిశోధనలు నిర్వహించారు. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ మనుషుల్లోని బోన్ మ్యారో (ఎముక మజ్జ) ప్లాస్మాను ప్రేరేపిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనితో కరోనా సోకి తగ్గినవారిలో ఇమ్యూనిటీ ఏడాదికిపైగా ఉంటుందని పేర్కొన్నారు. వ్యాక్సిన్ వేయించుకుంటే మరిం త ఎక్కువ కాలం ఇమ్యూనిటీ కొనసాగుతుందని తెలిపారు.
కణాలు ‘జ్ఞాపకం’ ఉంచుకుంటాయి
ఒక పరిశోధన ప్రకారం.. శరీరంలో కరోనా అంతమైపోయాక కూడా బోన్ మ్యారోలోని కణాలు కరోనాకు సంబంధించిన అంశాలను గుర్తుపెట్టుకుంటాయి. మళ్లీ అవసరమైనప్పుడు వెంటనే కరోనా యాంటీ బాడీలను ఉత్పత్తి చేసి, రక్తంలోకి వదులుతాయి. ∙‘మెమరీ బీ’ కణాలు నిరంతరం తమ దగ్గరి డేటాను అప్‌డేట్ చేసుకుంటూనే, మరింత సమర్థవంతంగా మారుతుంటాయని మరో పరిశోధనలో గుర్తించారు. ఇన్ఫెక్షన్ సోకినప్పటి నుంచి కనీసం 12 నెలల వరకు ఇది కొనసాగుతుందని.. ఆలోగా వైరస్ మళ్లీ సోకితే వెంటనే గుర్తించి, అడ్డుకునేలా రోగనిరోధక శక్తిని ప్రేరేపిస్తాయని తేల్చారు.
యాంటీబాడీలు తగ్గినా..
ఇమ్యూనిటీకి సంబంధించి.. కరోనా వైరస్ సోకిన 77 మందిపై పరిశోధనలు చేశారు. వారి రోగ నిరోధక వ్యవస్థలో వచ్చిన మార్పులు, కరోనా యాంటీబాడీలు, మెమరీ బీ కణాలను.. 3 నెలలకోసారి చొప్పున 5 సార్లు పరిశీలించారు.
- ఈ 77 మందిలో కరోనా వచ్చాక నాలుగు నెలలు యాంటీబాడీలు బాగానే ఉన్నాయని, తర్వాత వేగంగా తగ్గాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆపైనా తగ్గిపోతూ వచ్చాయని తేల్చారు. బోన్ మ్యారోలోని మెమరీ బీ కణాలు మాత్రం యథాతథంగా ఉన్నట్టు గుర్తించారు.
75 శాతం మందిలో ఓకే..
మెమరీ బీ కణాలకు సంబంధించి శాస్త్రవేత్తలు మరో పరిశోధన చేశారు. కరోనా వచ్చి తగ్గిన 19 మంది బోన్‌మ్యారో నుంచి కణజాలాన్ని పరిశీలించారు. వారికి కరోనా ఇన్ఫెక్షన్ సోకిననాటి నుంచి ఏడు నెలల తర్వాత కూడా.. 15 మంది బోన్‌మ్యారోలో మెమరీ బీ కణాలను గుర్తించారు. మిగతా నలుగురిలో ఆ కణాలు లేవు. ∙కరోనా సోకి తగ్గిన సుమారు 75 శాతం మందిలో మెమరీ బీ కణాలు మరికొంత కాలం ఉంటున్నాయని.. మరికొందరిలో చాలా తక్కువగాగానీ, మొత్తంగా లేకపోవడం గానీ ఉంటోందని శాస్త్రవేత్తలు తెలిపారు.
కొత్త వేరియంట్లు వచ్చినా..
మెమరీ బీ కణాలు, యాంటీబాడీలు కొత్త వేరియంట్లను ఎదుర్కొంటాయా అన్న దానిపై శాస్త్రవేత్తలు విడిగా పరిశోధన చేశారు. కోవిడ్ నుంచి కోలుకున్న 63 మంది నుంచి నెలకోసారి రక్తం శాంపిల్స్ తీసుకున్నారు. వారిలో యాంటీబాడీలు, మెమరీ బీ కణాలు ఏ విధంగా మారుతున్నాయని పరీక్షించారు.
- కోవిడ్ తగ్గిన తర్వాత 6–12 నెలల మధ్య యాంటీబాడీల్లో ఏ మార్పు జరగలేదని గుర్తించారు.
- ఇదే సమయంలో మెమరీ బీ కణాల్లో మాత్రం ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూ వచ్చాయని, పరిస్థితికి అనుగుణంగా అప్‌డేట్ అవుతున్నాయని తేల్చారు.
- మెమరీ బీ కణాలు అప్‌డేట్ అయ్యాక అవి ఉత్పత్తి చేసిన యాంటీబాడీలు సమర్థవంతంగా ఉంటున్నాయని, చాలా రకాల కరోనా వేరియంట్లను ఎదుర్కోగలుగుతున్నాయని గుర్తించారు.
కరోనా వచ్చాక వ్యాక్సిన్.. పూర్తి ఇమ్యూనిటీ!
కరోనా ఇన్ఫెక్షన్ సోకిన ఏడాది తర్వాత పరిశీలిస్తే.. వ్యాక్సిన్ వేసుకున్న పరిస్థితులను బట్టి ఇమ్యూనిటీ వేర్వేరుగా ఉంటోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
- అసలు వ్యాక్సిన్ వేసుకోని వారిలో.. ఇన్ఫెక్షన్ సోకిన ఏడాది తర్వాత కూడా స్వల్పంగా ఇమ్యూనిటీ ఉంటోంది. కొత్త వేరియంట్లు సోకితే ఎదుర్కొనే సామర్థ్యం మరికాస్త తక్కువగా కనిపిస్తోంది.
- కోవిడ్ సోకి తగ్గిపోయిన తర్వాత వ్యాక్సిన్ వేసుకున్న వారిలో ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటోంది. వారికి కొత్త వేరియంట్లు సోకినా కూడా సమర్థవంతంగా ఎదుర్కోగలిగే శక్తి సమకూరుతోంది. వీరికి బూస్టర్ డోసుల అవసరం ఉండకపోవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
- ఒక్కసారికూడా కోవిడ్ ఇన్ఫెక్షన్ సోకనివారిలో.. కరోనాను ఎదుర్కొనే మెమరీ బీ కణాలు, యాంటీబాడీలు ఉండవని, వారికి వ్యాక్సిన్ వేసుకున్నా పూర్తి ఇమ్యూనిటీ సమకూరే అవకాశం తక్కు వని శాస్త్రవేత్తలు అంటున్నారు. వీరికి వ్యాక్సిన్ బూస్టర్ డోసు అవసరం పడొచ్చని చెప్తున్నారు.
చాలా కాలం సంరక్షణ
‘‘కరోనా ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఉత్పత్తి అయిన మెమరీ బీ కణాలు.. వ్యాక్సిన్ తీసుకున్నాక మరింత సమర్థవంతంగా మారుతున్నాయి. కొత్త వేరియంట్లు సోకినా కూడా గుర్తించి స్పందిస్తున్నాయి. ఇమ్యూనిటీ చాలాకాలం ఉంటోంది. ఇలాంటి వారిలో వ్యాక్సిన్ బూస్టర్ డోసులు తీసుకోకున్నా ఇమ్యూనిటీ కొనసాగుతోంది..’’
– మైఖేల్ నుసేంజ్‌వేగ్, రాక్‌ఫెల్లర్ యూనివర్సిటీ ఇమ్యూనాలజిస్ట్
చదవండి: Black Fungus: 6 తప్పుడు కేసులను గుర్తించిన వైద్యులు
Comments
Please login to add a commentAdd a comment