న్యూయార్క్: అది బుధవారం (జులై 26). శ్వేతసౌదంలో ప్రెస్ సెక్రటరీగా పనిచేసిన సియాన్ స్పైసర్ రాజీనామా చేసిన అనంతర పరిణామాలతో కొంత చర్చాపూరిత వాతావరణంలోకి వెళ్లిపోయింది. సరిగ్గా ఆ సమయంలోనే దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు వివిధ ప్రాంతాల నుంచి చిన్నారులు రాసిన లేఖలను బహిరంగంగా వేదికపై నుంచి చదివే సంప్రదాయానికి తెరతీశారు. నాలుగు గంటల తర్వాత ట్రంప్‌కు వచ్చిన ఓ లేఖ పెద్ద వైరల్ అయింది. ఓ పికిల్ ట్రూతర్ అనే తొమ్మిదేళ్ల బాలుడు ఈ లేఖను రాశాడు. అతడి అసలు పేరు పికిల్ కాదుగానీ చుట్టుపక్కల వారు అలాగే పిలుస్తారంట. ఇంతకీ ఆ లేఖలో బాలుడు ఏం రాశాడంటే..
’నా పేరు డిలాన్.. కానీ నన్ను ప్రతిఒక్కరు పికిల్ అని పిలుస్తారు. నా వయసు తొమ్మిదేళ్లు. మీరు నాకు ఇష్టమైన అధ్యక్షులు. మిమ్మల్ని నేను చాలా ఇష్టపడతాను. ఓ పుట్టిన రోజు కూడా మీ నేపథ్యంలో జరుపుకున్నాను. మీ టోపిలాంటి కేకును నేను నా పుట్టిన రోజున కట్ చేశాను. మీ వయసు ఎంత? శ్వేతసౌదం ఎంత పెద్దగా ఉంటుంది? మీరు ఎంత డబ్బును కలిగి ఉన్నారు? ప్రజలు నిన్ను ఎందుకు ఇష్టపడరో నాకు తెలియదు. మీరు నాతో స్నేహం చేసేందుకు ఇష్టపడతారా? ఇక్కడ మీకు నేను నాఫొటో పంపిస్తున్నాను. దాన్ని మీరు చూసినట్లయితే హాయ్ చెప్పండి?’ అని ఆ బాలుడు లేఖ రాయగా ఆ ప్రశ్నలన్నింటికి సమాధానాలను వైట్ హౌస్ ద్వారా ప్రకటించారు. ముద్దుముద్దు పదాలతో రాసిన ఈ లేఖ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.